16 July, 2026 | 1:37 PM

వరి మద్దతు ధర 117 పెంపు

20-06-2024 12:30 AM
  • ఖరీఫ్ కాలానికి  సవరించిన కేంద్రం
  • 14 పంటల ఎంఎస్‌పీల పెంపుదల
  • అత్యధికంగా గడ్డి నువ్వులకు 983 పెంపు
  • కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, జూన్ 19: వరి పంట కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాల్‌కు రూ.117 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో వరి ధాన్యం ఎంఎస్‌పీ 2,300కు చేరింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో 2024 ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి 14 పంటల మద్దతు ధరలను సవరించింది. అత్యధికంగా గడ్డి నువ్వులకు క్వింటాల్‌కు  రూ.983 పెంచారు.

క్యాబినెట్ నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన తీసుకొన్న మొదటి నిర్ణయం కూడా రైతులకు సంబంధించినదే. నేటి క్యాబినెట్ సమావేశంలో కూడా రైతులకు సంబంధించిన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 14 పంటలకు సంబంధించి ఎంఎస్‌పీని సవరిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది. ఉత్పత్తి వ్యయానికి ఎంఎస్‌పీ కనీసం 1.5 రెట్లు ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయం తీసుకొన్నాం.

అందులో భాగంగానే నేడు ఎంఎస్‌పీలను సవరించాం. దేశంలోని అనేక జిల్లాలు, మండలాల్లో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సంస్థ పూర్తి శాస్త్రీయంగా అధ్యయనం నిర్వహించి ఉత్పత్తి వ్యయాన్ని నిర్ధారించింది’ అని వివరించారు. ఈ పెంపువల్ల ఖరీఫ్ సీజన్‌లో రైతులకు దాదాపు రూ.35,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరనున్నదని అంచనా వేశారు. 2013-14లో వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1,310 ఉండగా, తాజా పెంపుతో రూ.2,300కు చేరింది. తాజా నిర్ణయంతో వరిధాన్యం ఎంఎస్‌పీలో 5.35 శాతం పెరుగుదల నమోదైంది. 

క్యాబినెట్ మరికొన్ని నిర్ణయాలు

* మహారాష్ట్రలోని విధావన్ వద్ద రూ.76,000 కోట్లతో డీప్ డ్రాఫ్ట్ పోర్టు నిర్మాణం.

* గుజరాత్, తమిళనాడులో రూ.7,453 కోట్లతో ఆఫ్‌షోర్ పవన విద్యుత్తు కేంద్రాల నిర్మాణం.

* వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయం విస్తర్ణకు రూ.2,869.65 కోట్లు.

పంటలకు మద్దతు ధరలు

పంట రకం పెంపు కొత్త 

(రూ.ల్లో) ఎంఎస్‌పీ

వరి (సాధారణ రకం) 117 2,300

వరి (గ్రేడ్-ఏ) 117 2,320

పత్తి (సాధారణ రకం) 510 7,121

పత్తి (ఇతర రకాలు) 510 7,521

జొన్నలు (హైబ్రిడ్) 191 3,371

జొన్నలు (మాల్దండి) 196 3,421

రాగులు 444 4,290

సజ్జలు 125 2,625

మొక్కజొన్న 135 2,225

పెసలు 124 8,682

కందులు 550 7,550

మినుములు 450 7,400

గడ్డి నువ్వులు 983 8,717

నువ్వులు 632 9,267

వేరుశనగ 406 6,783

పొద్దు తిరుగుడు 520 7,280

సోయాబీన్ (పసుపు) 292 4,892