16 July, 2026 | 1:53 PM

నలంద మన గౌరవం

20-06-2024 12:28 AM
  • భారత్ సహా ఆసియా చరిత్రను ప్రతిబింబిస్తుంది
  • నలంద పునర్నిర్మాణంతో మళ్లీ స్వర్ణయుగం
  • వర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభించిన సందర్భంగా మోదీ ఉద్ఘాటన

రాజ్‌గిర్ (బీహార్), జూన్ 19: నలంద అనేది కేవలం పేరు మాత్రమే కాదని, ఇది ఒక గుర్తింపు, గౌరవమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. నలంద ఒక విలువైన మంత్రమని పేర్కొన్నారు. బీహార్ రాజ్‌గిర్‌లోని నలంద విశ్వవిద్యాలయంలోని కొత్త క్యాంపస్‌ను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ రాజేంద్ర వీ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్‌ను ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే నా లక్ష్యం. మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన 10 రోజుల్లోనే నలందను సందర్శించే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. నలంద పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోంది. ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేస్తుంది. నలంద మనకు గుర్తింపు. గౌరవం. విలువైన మంత్రం.

అగ్ని పుస్తకాలను మాత్రమే కాల్చుతుంది. కానీ జ్ఞానాన్ని నాశనం చేయలేదు. నలంద అనేది కేవలం భారత చరిత్ర కాదు. ఆసియా మొత్తానికి సంబంధించింది. ఆ దేశాలు కూడా ఈ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఇది వసుధైక కుటుంబ స్ఫూర్తి. ఇక్కడికి చాలా దేశాల నుంచి విద్యార్థులు రావడం మొదలైంది. 20 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ కొత్త క్యాంపస్ దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఉదాహరణగా చూపుతుంది. గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో చూపుతుంది అని తెలిపారు. ప 

ప్రాచీన విద్యాకేంద్రం..

పురాతన కాలం నుంచి భారత్ విద్యా కేంద్రంగా విలసిల్లింది.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నలంద గురించి. ప్రపంచంలో వసతి కలిగిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా నలంద ఖ్యాతి గడించింది. బీహార్‌ను పురాతన కాలంలో మగధగా పిలిచేవారు. దాని రాజధాని పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా). దీనికి 90 కిలోమీటర్ల దూరంలో రాజగృహ (ప్రస్తుత రాజ్‌గిర్)లో నలంద విశ్వవిద్యాలయం ఉంది. భారత్ స్వర్ణయుగంగా భావించే గుప్తుల కాలంలో దీన్ని నిర్మించారు. 5వ శతాబ్దంలో మొదటి కుమారగుప్తుడు దీన్ని స్థాపించారు. 427 నుంచి 1197వ సంవత్సరం వరకు దాదాపు 800 సంవత్సరాలు నలంద మనుగడ సాధించింది. గొప్ప విద్యావేత్తలు ఇక్కడ బోధించారు. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖల్జీ హయాంలో అతని కమాండర్ మహ్మద్‌బిన్ భక్తియార్ ఖల్జీ నలందను ధ్వంసం చేసి దోచుకెళ్లాడు. 

మహావిహార సందర్శన

కార్యక్రమానికి ముందు యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నలంద మహావిహారను మోదీ సందర్శించారు. ఏఎస్‌ఐ పాట్నా సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ గౌత మి భట్టాచార్య నలంద విశ్వవిద్యాలయ పురాతన శిథిలాల గురించి మోదీకి వివరించారు. నలంద అవశేషాల సందర్శన విలక్షణమైనది. చరిత్రలో ఎంతో మందికి విద్యను పంచిన స్థలాన్ని దర్శించే అవకాశం లభించింది. ఒకప్పుడు ఈ ప్రదేశంలో వర్ధిల్లిన గొప్ప పండితుల గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది. నలంద మన దేశానికి మేధో స్ఫూర్తిని అందిస్తుంది అని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.