ఉప్పొంగిన అగ్రరాజ్యం
అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
దేశవ్యాప్తంగా ఉత్సవాలు
పటాకుల మోతతో దద్దరిల్లిన వాషింగ్టన్
వాషింగ్టన్, జూలై ౫: అమెరికావ్యాప్తంగా ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వారి ౨౫౦వ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. యావత్ దేశం ఉత్సవాల్లో మునిగితేలింది. ముఖ్యంగా వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ ప్రాంతం జనసందోహంతో కిటకిటలాడింది. సాయంత్రం వేళ ఆకాశంలో సైనిక విమానాల విన్యాసాలు అద్భుతంగా సాగాయి. కొత్తగా తీర్చిదిద్దిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం విన్యాసాలకు నాయకత్వం వహించింది.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వేడుకలకు కాసేపు ఆటంకం కలిగించింది. అయినప్పటికీ, జనం ఆ ప్రాంగణం నుంచి కదలలేదు. రాత్రి సిబ్బంది ౮ లక్షలకు పైగా పటాకులను కాల్చారు. పెద్ద పెద్ద శబ్దాలతో తారజువ్వలు నింగిలోకి దూసుకెళ్లాయి. కొద్దిక్షణాల పాటు మిరుమిట్లు గొలిపాయి. ఆ పటాకుల మోత దేశ చరిత్రలోనే అతిపెద్ద పటాకుల ప్రదర్శనగా నిలిచింది.
ఈ చారిత్రక వేడుకను పురస్కరించుకుని దేశాధ్యక్షుడు ట్రంప్ వివిధ కేసుల్లో దోషులుగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ౧౧ మంది క్షమాభిక్ష ప్రసాదించారు. డల్లాస్‌కు కూతవేటు దూరంలోని ఇర్వింగ్ నగరంలోనూ ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా పాల్గొన్నారు. గాంధీ స్మారక ప్రాంతం వద్ద ఆయన స్థానికులతో కలిసి నివాళి అర్పించారు.
తిరుగులేని దేశం అమెరికా: ట్రంప్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ వేదికగా ‘సెల్యూట్ టు అమెరికా’ పేరుతో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. స్వేచ్ఛకు, ప్రజల పట్టుదలకు ఇండిపెండెన్స్ డే నిదర్శనమని కొనియాడారు. రెండున్నర శతాబ్దాలుగా ప్రపంచ దేశాల మధ్య అమెరికా ఒక నమ్మకంగా, ఆశగా నిలిచిందని కీర్తించారు. ప్రస్తుతం దేశం మునుపెన్నడూ లేనంత బలంగా, తిరుగులేని దేశంగా వెలుగొందుతున్నదని కొనియాడారు. అంతరిక్ష వ్యోమగాములను, చారిత్రక వ్యక్తుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నా. అనంతరం ౨వ ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధాల్లో అమరులైన సైనికులకు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వేడుకపై దుండగుడి కాల్పులు
నలుగురు చిన్నారులు సహా 8 మందికి గాయాలు
న్యూయార్క్, జూన్ 5: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం వేళ కలకలం రేగింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సమీపంలోని కోన్లీ ఐలాండ్ వద్ద ఓ కుటుంబం బాణాసంచా ప్రదర్శన నిర్వహిస్తుంది. నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రదర్శనను తిలకిస్తున్న జన సమూహంపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో 21 ఏళ్ల మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులను గుర్తించాల్సి ఉందని, ఆ తరువాతే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.






