6 July, 2026 | 2:52 AM

ఉత్తరాదిన జడివాన

06-07-2026 02:01 AM

వరదల్లో పలువురు గల్లంతు

మహారాష్ట్రలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు మృతి

ముంబై/ఢిల్లీ, జూలై 5: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జెనిత్ జలపాతం వద్ద అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో వందమంది చిక్కుకుపోగా స్థానికులు, రెస్క్యూ సిబ్బంది తాళ్ల సహాయంతో కాపాడారు. సలసోపారాలో 20 కార్లు వరదనీటిలో మునిగిపోయాయి. ముంబైలో 64 చెట్లు కూలిపోగా, 8 ఇళ్ల గోడలు కూలిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఇద్దరు మృతిచెందారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంటికి సమీపంలో ఓ భారీ చెట్టు కూలిపోయింది. అమీర్‌ఖాన్ ఆదివారం మూడో పెళ్లి చేసుకోవడంలో బిజీగా ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ఇంటికి వచ్చే అతిథులను దృష్టిలో పెట్టుకొని బీఎంసీ వెంటనే చర్యలు చేపట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కాన్వాయ్‌లో వెళుతుండగా బంద్రా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కూలిపోయింది. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు చెట్టును తొలగించారు.

థానేలో ఓ భారీ పైప్‌లైన్ పగిలిపోవడంతో రోడ్డుపై నీరు ఉప్పొంగింది. వసాయి జిల్లా మధుబన్ ప్రాంతంలో భారీ వర్షానికి 20 కార్లు నీటమునగగా, ఒక కారు 50 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. కుర్లా టెర్మినల్ సమీపంలో రహదారి జలమయమైంది. ముంబైలోని ఘట్‌కోపర్ వద్ద భారీ చెట్టుకూలి అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్ర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. 13 విమానాలను ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు.

పుణెలో ఓ సొసైటీ గోడకూలి 14 వాహనాలు ధ్వంసమయ్యాయి. ముంబై వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అక్కడి ప్రజలను కోరింది. గడిచిన 24 గంటల్లో పలు చోట్ల 20 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో 30 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యవసరమైతే తప్ప 24 గంటలపాటు బయటికి రావొద్దని బీఎంసీ హెచ్చరించింది. 

దేశరాజధాని ఢిల్లీలోను అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. 15 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. గుజరాత్లోని జునాగడ్‌లో పలురహదారులపై 4 అడుగుల మేర నీరు చేరింది. పడవల సహాయంతో స్థానికులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

మధ్యప్రదేశ్‌లోని హర్దాలో కలీమ్ చక్ నది నీరు వంతెన కంటే మూడు అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. షియోపూర్‌లో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందగా, అతని కూతురు గాయాలతో బయటపడింది. అష్టాలోని బాప్చా డోనియా గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై మోకాలిలోతు నీరు చేరింది. ఉత్తరాఖండ్ హల్దానీలో ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఓ పాఠశాలలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తుంది. యమునోత్రిలో కొండచరియలు విరిగిపడడగా రహదారిని మూసివేశారు.

బీహార్‌లో 18 జిల్లాలకు అలర్ట్ జారీ అయింది. జమ్మూకశ్మీర్‌లోనూ వర్షాల కారణంగా రామ్‌నగర్ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిని మూసివేసి సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. యూపీలోని 28 జిల్లాలు, పశ్చిమ బంగాల్‌లోని 2, ఒడిశాలోని ఐదు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ విధించింది. ఆంధ్రప్రదేశ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, మేఘాలయ, సిక్కిం, గోవా, తెలంగాణ, కర్ణాటకలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.