100 నగరాల దేశంగా భారత్
- కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి
2050 నాటికి భారతదేశంలో వంద నగరాలు అభివృద్ధి చెందుతాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో ఎనిమిది మెగా సిటీలతో పాటు దాదాపు 100 నగరాలు ఉంటాయని అంచనా. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ (ఎన్‌ఐపీ), పీఎం గతిశక్తి ప్రాజెక్టులు టైర్- నగరాలను వృద్ధివైపు తీసుకెళ్తాయని నివేదిక పేర్కొంది. భారత్‌లో పట్టణీకరణ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రియల్‌రంగం పరుగులు పెడుతుండటంతో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రాపర్టీ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పట్టణాల కోసం అన్వేషిస్తున్నారని ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. దేశంలోని రియల్‌కు అనుకూలంగా ఉన్న నగరాల కోసం అన్వేషణ కొనసాగుతుందని, సమీప భవిష్యత్తులోనే దేశంలో 17 నగరాలు రియల్‌కు హాట్‌స్పాట్‌గా మారుతాయని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా తాజాగా వెల్లడించిన నివేదికలో వెల్లడించింది.
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 29 (విజయక్రాంతి): కొత్త నగరాలు దేశం నలుదిక్కులా విస్తరించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి ఉండగా.. తూర్పున పాట్నా, పూరి, పశ్చిమాన ద్వారక, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్, దక్షిణాన కోయంబత్తూర్, తిరుపతి, విశాఖ, ఇండోర్ ఉన్నాయి. ఈ నగరాలలో కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం, రెసిడెన్షియల్, సీనియర్ లివింగ్ సహా వివిధ క్యాటగిరీలో వేగవంతమైన వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రాపర్టీ రిసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా తన నివేదిక వెల్లడించింది.
వికేంద్రీకృత పని వాతావరణం, టైర్ నగరాల వైపు ప్రాధాన్యత మారడం ఈ వృద్ధికి కీలకం అని పేర్కొన్నారు. వర్క్‌స్పేస్, ల్యాండ్‌స్కేప్‌లలో మార్పులు, వివిధ కారిడార్లలో మౌలిక సదుపాయాల పెరుగుదల, పర్యాటకం (ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం), ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల పెరిగిన డిజిటలైజేషన్ వంటి నాలుగు ప్రధాన అంశాలు రియల్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయని కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు.
ఒక్కో దిక్కున ఒక్కో విధంగా...
కోయంబత్తూర్, ఇండోర్, కోచి బలమైన శాటిలైట్ ఆఫీస్ మర్కెట్లుగా ఎదుగుతుండగా.. జైపూర్, కాన్పూర్, లక్నో, నాగ్ పూర్, పాట్నా, సూరత్ లు డిజిటలైజేషన్‌ను పెంచుతాయని ప్రాపర్టీ రిసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. అమృత్‌సర్, అయోధ్య, ద్వారక, పూరి, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక, పర్యాటక వృద్ధి నుంచి ప్రయోజనం పొందుతాయని అందులో పేర్కొన్నారు. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాలు ఈ అభివృద్ధి చెందుతున్న హాట్‌స్పాట్‌లలో గిడ్డంగులు, రెసిడెన్షియల్ విభాగాల్లో డిమాండ్ పెంచుతాయని ఆ నివేదికలో విశ్లేషించారు.
హైబ్రిడ్ మోడల్స్ వైపు మారడం వల్ల చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరుగుతోందని, డిటిల్ వ్యాప్తి చిన్న పట్టణాలను డేటా సెంటర్లు, స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం హబ్‌లుగా మారుస్తోందని ఆ నివేదికలో తెలిపారు. జైపూర్, కాన్పూర్, లక్నో వంటి నగరాలు ఈ-కామర్స్‌కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు కీలకంగా మార తాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.






