హైరైజ్ భవనాలపై.. ఫీజుల భారం తగ్గేనా!
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 29 (విజయక్రాంతి): హైరైజ్ భవనాలపై తెలంగాణ ప్రభుత్వం అధిక ఫీజులను వసూలు చేస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరు నగరంలో హైరైజ్ బిల్డింగ్స్ మీద ఒక్కో చదరపు అడుగుకు ౫౦ రూపాయల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నా రు. కానీ, హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల మీద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల్ని నిర్మించే ఒక బిల్డర్, ల్యాండ్ ఓనర్ షేర్‌తో కలిపి ఒక్కో చదరపు అడుగుకు రూ.300 వరకు చెల్లించాల్సి వస్తున్నదని బిల్డర్లు వాపోతున్నారు.
ఇందులో ప్రధానంగా కోకాపేట్ డెవలప్‌మెంట్ పేరుతో ప్రతి చదరపు అడుగుకు రూ.35, స్లిప్ రోడ్ల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.50, ఇతర ఫీజుల పేరిట ఒక్కో చదరపు అడుగుకు రూ.100చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ ఫీజులను హేతు బద్ధీకరిస్తే రియల్ మార్కెట్ మరింత వృద్ధిని నమో దు చేసుకుంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రప్రభుత్వం ఇన్‌కంట్యాక్స్ రూల్స్ తగ్గించినప్పుడు రెవెన్యూ గణనీ యంగా పెరిగినట్టుగా, నిర్మాణాలపై ఫీజులను తగ్గించి వాయిదా పద్ధతుల్లో వసూలు చేయాలని, ఇలా చేయడం వలన డెవలపర్లు ప్రాజెక్టు డెవలప్‌మెంట్ మీద దృష్టి పెడతారని, కొత్త ప్రాజెక్టులు వస్తాయని పేర్కొంటున్నారు. దీంతో జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటివి పెరిగి.. ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుందని రియల్టర్లు పేర్కొంటున్నారు.
బిల్టప్ ఏరియాపై మార్టిగేజ్..
రియల్ రంగం ఎదుర్కొంటున్న బిల్టప్ ఏరియాపై మార్ట్‌గేజ్ మరో ప్రధాన సమస్యగా మారిందని రియల్టర్లు/బిల్డర్లు పేర్కొంటున్నారు. జీవో నంబర్ 86 ప్రకారం స్థానిక సంస్థలు పది శాతం బిల్టప్ ఏరియాను మార్ట్‌గేజ్‌గా పెట్టుకుంటున్నాయి. మరో పది శాతం బిల్టప్ ఏరియాను ఫీజ్ డిఫర్‌మెంట్ కింద పెట్టాల్సి వస్తోంది. ఈ 20 పర్సంట్‌పై బ్యాంకులు రుణాలను మంజూ రు చేయట్లేదు. డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో బిల్డర్లకు వచ్చే 65 శాతం వాటాలో ఇరవై శాతాన్ని మార్ట్‌గేజ్ కింద పెడితే.. ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి బిల్డర్లు తమ పెట్టుబడిని రికవర్ చేసుకోలేని పరిస్థితి నెలకొందని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్ట్‌గేజ్ నిబంధనలను ప్రభుత్వం సవరిస్తే నిర్మాణ సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి బిల్డర్లు నిబంధనలకు లోబడి భవనాలను నిర్మిస్తారని వారు సూచిస్తున్నారు.






