20-02-2026 01:44:37 AM
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రశంసలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౯: డిజిటల్ చెల్లింపుల్లో భారత యూపీఐ వ్యవస్థ యావత్ ప్రపంచానికి ఆదర్శమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రశంసలు కురిపించారు. న్యూఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ చెల్లింపుల్లో మరే ఇతర దేశం ఇంతటి విజయం సాధించలేదని చెప్పుకొచ్చారు. 140 కోట్ల మంది ప్రజలకు ఆధార్ కార్డు ఇవ్వడం సాధారణ విషయం కాదని కితాబునిచ్చారు.
ప్రతి భారతీయుడికి ఒక ప్రత్యేక డిజిటల్ గుర్తింపునివ్వడం ద్వారా పారదర్శకమైన పాలనకు నిదర్శనమని అభివర్ణించారు. పదేళ్ల క్రితం తాను ముంబై వచ్చానని, నాడు.. వీధి వ్యాపారులకు కనీసం బ్యాంక్ ఖాతా ఉండేది కాదని.. అలాంటిది ఇప్పుడు.. వ్యాపారులు తమ ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించడం తనను ఆశ్చర్యపరిచిందని వివరించారు.
యూపీఐ ద్వారా నెలకు 20 బిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయంటే.. భారత్ సాంకేతికత వినియోగంలో ఎంత ముందంజలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భారతదేశం కేవలం ఒక దేశం మాత్రమే కాదని, వేల ఏళ్ల గొప్ప చరిత్ర కలిగిన దేశమని కొనియాడారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, భారత్ తన మూలాలను, సంస్కృతిని కాపాడుకుంటున్న తీరు అద్భుతమని ప్రశంసించారు.