బాధ్యత గల మాటలేనా?
- కవిత బెయిల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
- ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు
- బాధ్యతగా ఉండాలని మందలింపు
- ఓటుకు నోటు కేసు విచారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావటంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బాధ్యతగల వ్యక్తులు ఏదైనా మాట్లాడేటప్పుడు అవి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలని మందలించింది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కవిత బెయిల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో న్యాయమూర్తులు సీఎం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆయన (సీఎం) ఏం మాట్లాడారో చదివారా? (రేవంత్ న్యాయవాదిని ఉద్దేశించి). ఒకసారి చదవండి.. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య పరస్పర గౌరవ మర్యాదలు ఉండాలి. మేం రాజకీయ కారణాలతో తీర్పు ఇచ్చామని ఎవరైనా ఎలా అంటారు? మీరు (సీఎం) మాకు గౌరవం ఇవ్వకపోతే.. మేం కూడా ఈ కేసు (ఓటుకు నోటు)ను వేరే చోటికి మారుస్తాం. ఇది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం.
చట్టాన్ని పాటించని మహారాష్ట్ర అడవులు, రెవెన్యూశాఖల అదనపు ముఖ్య కార్యదర్శికి నిన్ననే (28న) నోటీసులు (కోర్టు ధిక్కరణ) ఇచ్చాం. మేం ఏదైనా రాజకీయ పార్టీని సంప్రదించిన తర్వాత బెయిల్‌పై తీర్పు ఇచ్చామని చెప్పదలుచుకొన్నారా? మేం చేసిన ప్రమాణాలకు కట్టుబడి విధులు నిర్వహిస్తున్నాం. ఈ మాటల (రేవంత్ ప్రకటన) ఆధారంగా కేసు (ఓటుకు నోటు) బదిలీపై నిర్ణయం తీసుకొంటాం. దీన్ని మేం ఇప్పుడే ముగించాలని అనుకోవటం లేదు. ఇతర విభాగాల్లో జోక్యం చేసుకోబోమని మేం ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటాం. ఇతరుల నుంచి కూడా అదే ఆశిస్తాం’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసుపై తీవ్ర ప్రభావం
2015 నాటి ఓటుకు నోటు కేసు ప్రస్తుతం తెలంగాణలోనే విచారణలో ఉన్నది. 2021లో ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే బీఆర్‌ఎస్ నేతలు ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు రేవంత్‌కు అనుకూలంగానే స్పందించింది. ప్రభు త్వం మారగానే న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారులపై నిందలేస్తారా? అని పిటిషనర్లను మందలించింది.
గురువారం నాటి విచారణలో కూడా ఉద యం సెషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌కు అనుకూలంగానే ధర్మాసనం స్పందించింది. మధ్యాహ్నం పిటిషనర్ల న్యాయవాదులు కవిత బెయిల్‌పై సీఎం వ్యాఖ్యలను ప్రస్తావించటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రేవంత్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ సీఎం వ్యాఖ్యల కు క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించినా న్యాయమూర్తులు సంతృప్తి చెందలేదు. దీంతో సోమవారం కోర్టు ఏం తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొన్నది.




