19 August, 2026 | 1:01 AM

పట్టుబిగించిన భారత్

19-08-2026 12:00 AM

గాలే టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో త్వరగానే ఆలౌటైనా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బౌలర్లు సత్తా చాటి లంక టాపార్డర్ ను కుప్పకూల్చారు. ఫలితంగా నాలుగో రోజే శ్రీలంక 4 వికెట్లు కోల్పోయింది. చివరి రోజు వర్షం అడ్డుపడకుంటే భారత్ విజయం సాధించే అవకాశముంది. 

  1. గెలుపుకు 6 వికెట్లే దూరం 
  2. పోరాడుతున్న శ్రీలంక 
  3. టార్గెట్ 372, ప్రస్తుతం లంక 84/4 
  4. వరుణుడిపైనే లంక ఆశలు

గాలే, ఆగస్టు 18 : నాలుగో రోజు వీలైనంత వేగంగా పరుగులు చేసే క్రమంలో టీమిండియా వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ డకౌటవడంతో సరైన ఆరంభం లభించలేదు. తర్వాత రాహుల్, పడిక్కల్ మరోసారి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ కు 65 పరుగులు జోడించారు. రాహుల్ 35 పరుగులకు ఔటవగా, గిల్ (8) మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో పడిక్కల్ కు పంత్ జత కలిసాడు. వీరిద్దరూ వేగంగా ఆడి 30 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు.

పడిక్కల్ హాఫ్ సెంచరీ చేజార్చుకోగా, పంత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. వన్డే తరహాలో ఆడుతూ సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. లాహిరు కుమార బౌలింగ్‌లో సిక్స్ బాది ఈ ఫీట్ అందుకున్నాడు. ఇదే సిక్సర్‌తో అతని హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. 89 ఇన్నింగ్స్‌లోనే రిషభ్ పంత్ ఈ ఘనతను సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

ఈ జాబిజాలో బెన్ స్టోక్స్ టాప్ ప్లేస్‌లో ఉండగా, మెక్‌కల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా పంత్ దూకుడుతో భారత్ మరింత భారీస్కోరు చేసేలా కనిపించినా లంక బౌలర్లు పుంజుకుని కట్టడి చేశారు. ఒక దశలో 174 పరుగులకు 5 వికెట్లతో బలంగా కనిపించిన భారత్ మరో 19 పరుగులకే మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. పంత్ 66 ( 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా, జురెల్ 7, జడేజా 9, సుతార్ 9 నిరాశ పరిచారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది.

లంక బౌలర్లలో ఫెర్నాండో 4 , ప్రభాత జయసూర్య 3, కుమార 2 వికెట్లు తీసారు. తర్వాత 371 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లంక బ్యాటర్లను టీమిండియా బౌలర్లు బెంబేలెత్తించారు. ఓపెనర్ నిసాన్ మదుష్కను మరోసారి సిరాజ్ పెవిలియన్ కు పంపిస్తే, ఉదారను మానవ్ సుతార్ ఔట్ చేశాడు. తర్వాత సూర్యబండార (0), కమిందు మెండిస్ (2) కూడా ఔటవడంతో లంక 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ ధనంజయ డిసిల్వా, దినుష పోరాడారు.

వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో నాలుగోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. డిసిల్వా 31 నాటౌట్, దినుష 25 నాటౌట్ క్రీజులో ఉన్నారు. విజయం కోసం చివరి రోజు భారత్‌కు 6 వికెట్లు కావాల్సి ఉండగా, శ్రీలంక 288 పరుగులు చేయాల్సి ఉంది.

టార్గెట్ ఛేదించడమే అసాధ్యంగానే కనిపిస్తున్నప్పటకీ వర్షం అడ్డుపడితే మాత్రం మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రేపు తొలి సెషన్ ఇరు జట్లకు కీలకం కాబోతోంది. భారత స్పిన్నర్లు చెలరేగి వికెట్లు తీస్తే రెండు సెషన్లలోనే లంక కథ ముగించి సిరీస్‌లో బోణీ కొట్టేందుకు వీలుంటుంది.