స్లీమనాబాద్ సొరంగం పూర్తి!
17 ఏళ్ల నిరీక్షణకు తెర
- వింధ్య ప్రాంతానికి నర్మదా జలాలు ప్రవహించేలా కొత్త దారి
- 12 కిలోమీటర్ల ఇంజినీరింగ్ అద్భుతం
- నీటి కొరతకు శాశ్వత పరిష్కారం!
- మధ్యప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
- హైదరాబాద్‌కు చెందిన పటేల్ జాయింట్ వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్‌లో నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వింధ్య ప్రాంతానికి నర్మదా జలాలను అందించే ప్రతిష్ఠాత్మక స్లీమనాబాద్ సొరంగం నిర్మాణం పూర్తికావడం రాష్ట్ర నీటిపారుదల చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొనవచ్చు. బర్గీ డైవర్షన్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సుమారు 12 కిలోమీటర్ల సొరంగ నిర్మాణం.. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) సహాయంతో సొరంగాన్ని పూర్తిగా తవ్వితీసినట్టు అధికారులు తెలిపారు.
ఇది భారతదేశంలోని అతిపెద్ద నీటి సొరంగ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. సుమారు రూ.1600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు, సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ పూర్తి కావడం మధ్యప్రదేశ్ ఇంజినీరింగ్ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. జబల్‌పూర్‌లోని బర్గీ ఆనకట్ట నుంచి నర్మదా జలాలను కట్నీ, రేవా, సత్నా, మైహర్, పన్నా జిల్లాలకు తరలించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 2.45 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి శాశ్వతంగా సాగునీరు అందనుంది. దాదాపు 1,450 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. దీనితో వింధ్య ప్రాంతంలోని వ్యవసాయం, ప్రజల జీవనోపాధిలో గణనీయమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత కేవలం నీటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలోనే లేదు. సహజంగా పశ్చిమ దిశగా ప్రవహించే నర్మదా జలాలను తూర్పు దిశగా మళ్లించి సోన్ నదీ పరివాహక ప్రాంతానికి, అక్కడి నుంచి గంగా నదీ పరివాహక ప్రాంతానికి చేరవేయడం దీని ప్రత్యేకత. అందుకే దీనిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కీలక జీవనాడిగా అభివర్ణించారు. స్లీమనాబాద్ సొరంగం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సహజ వనరులతో వింధ్య ప్రాంతం సమృద్ధిగా ఉన్నప్పటికీ.. నిరంతరం నీటి కొరత కారణంగా వ్యవసాయం, ప్రజల జీవనోపాధి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుందని సీఎం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి యాదవ్ స్వయంగా స్లీమనాబాద్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా గురుత్వాకర్షణ ఆధారంగా నీరు ప్రవహించేలా సొరంగాన్ని రూపొందించడం వల్ల నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్తుపై ఆధారపడాల్సిన అవసరం లేదు.
ఇది ప్రాజెక్టును సుదీర్ఘకాలంగా మరింత సమర్థవంతమైనదిగా సేవలు అందించేలా చేస్తుంది. పన్నెండు కిలోమీటర్ల ప్రధాన సొరంగంతో పాటు 1.195 కిలోమీటర్ల అప్రోచ్ టన్నెల్ కూడా నిర్మించారు. మొత్తం నిర్మాణంలో సుమారు 70 శాతం పనులు టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా చేయగా.. మిగిలిన 30 శాతం పనులను సంప్రదాయ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతుల్లో చేపట్టారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఆధునిక టన్నెల్ బోరింగ్ మిషన్‌తో అప్‌స్ట్రీమ్ వైపు నుంచి తవ్వకాలు ప్రారంభించడమే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని హైదరాబాద్‌కు చెందిన పటేల్ జాయింట్ వెంచర్ సంస్థ టర్న్‌కీ పద్ధతిలో కాంట్రాక్టును చేపట్టింది. సొరంగం మొత్తం పొడవు సుమారు 12.088 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో మొత్తం 96.56 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. సొరంగం నిర్మాణం పూర్తికావడం ఒక ఇంజినీరింగ్ అద్భుత విజయమే అయినప్పటికీ అసలు పరీక్ష నీరు రైతుల పొలాలకు చేరినప్పుడే మొదలవుతుంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సాగునీటి విస్తరణను దశలవారీగా పెంచనున్నారు.
2026 డిసెంబర్ నాటికి 87,433 హెక్టార్లకు, 2027 డిసెంబర్ నాటికి 1,54,693 హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యాలు ఉన్నాయి. అనంతరం పూర్తి సామర్థ్యంతో సుమారు 2.45 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందించే దిశగా ప్రాజెక్టు ముందుకు సాగనుంది. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం, పరిహారం, పునరావాస చర్యలు చేపట్టడం కూడా ఇందులో ముఖ్యమైన అంశం. అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం ఇలాంటి భారీ ప్రాజెక్టుల విషయంలో అత్యంత అవసరం.
నర్మదా జలాలు వింధ్య ప్రాంతానికి చేరడం వల్ల కేవలం సాగునీరు మాత్రమే అందదు. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం, పంటలలో వైవిధ్యం మెరుగుపడడం, రైతుల ఆదాయం పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం వంటి అనేక మార్పులకు ఇది దోహదపడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జలవిద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో దీర్ఘకాలికంగా, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈసొరంగం తీవ్ర భూకంపాలను తట్టుకునేలా రూపొందించారు.
దీని నిర్వహణ జీవితకాలం 100 సంవత్సరాలుగా అంచనా వేశారు. అయితే ఇలాంటి భారీ నీటి మళ్లింపు ప్రాజెక్టుల విజయాన్ని కేవలం నిర్మాణం పూర్తయిందా లేదా అన్నదానితో కొలవలేం. నీరు నిర్దేశిత ప్రాంతాలకు సమయానికి, సమర్థవంతంగా చేరుతుందా? భూగర్భ జలాలు, పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుంది? రైతులకు వాస్తవంగా ఎంత ప్రయోజనం అందుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబోయే కాలంలోనే స్పష్టమవుతాయి.
దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ ప్రయాణం చివరకు కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు స్లీమనాబాద్ సొరంగం కాంక్రీట్, రాళ్లు, యంత్రాలతో నిర్మించిన ఒక భారీ మౌలిక వసతిగా కాకుండా వేలాది రైతుల ఆశలకు ప్రతీకగా మారింది. నర్మదా జలాలు వింధ్య ప్రాంతపు పొలాలను తడిపిన రోజునే ఈ ఇంజినీరింగ్ అద్భుతం తన అసలు అర్థాన్ని సంతరించుకుంటుంది. నీటి భద్రత, వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక పురోగతికి ఇది నిజమైన ఆధారంగా నిలిస్తే, 17 ఏళ్ల నిరీక్షణకు సార్థకమైన ముగింపు లభించినట్టే..!
ఇంజినీర్లకు ఎదురైన సవాళ్లు
అయితే సొరంగం నిర్మాణం అంత సులభంగా సాగలేదు. మార్బుల్, సున్నపురాయి, డోలమైట్ వంటి కఠినమైన భూగర్భ శిలలు, సున్నపురాయి కరిగిపోవడం వల్ల ఏర్పడిన భారీ భూగర్భ గుహలు ఇంజినీర్లకు సవాళ్ళు విసిరాయి. కొన్ని ప్రాంతాల్లో నిమిషానికి 25 వేల లీటర్ల వరకు నీటి ప్రవాహం, భూగర్భ జలాల లీకేజీలు, నేల కుంగిపోవడం, అస్థిరమైన రాతి నిర్మాణాలు తవ్వకాల ప్రక్రియను మరింత కష్టతరం చేశాయి. అయినప్పటికీ ప్రత్యేక గ్రౌండ్ గ్రౌటింగ్ సాంకేతికతను ఉపయోగించి భూభాగాన్ని దృఢంగా చేశారు.
నిర్మాణ పనులను నిరంతరంగా కొనసాగించేందుకు 8 గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది, కార్మికులు పనిచేశారు. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికుల దీర్ఘకాలిక కృషి ఫలితంగా సొరంగ నిర్మాణం తుది దశకు చేరుకుంది. జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, భూగర్భ మౌలిక వసతులు, జనావాసాల కిందుగా సొరంగాన్ని నిర్మించాల్సి వచ్చినప్పటికీ నిర్మాణ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.






