పునఃప్రారంభం.. వసతులు శూన్యం!
- గరిడేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు
- చీకటి పడితే ఆర్టీసీ బస్టాండ్ అంధకారం.. ప్రయాణికులకు భయం భయం..
- కనీస వసతులు లేక మహిళలకు మరింత ఇబ్బందులు
- బస్టాండ్‌లోకి అన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
గరిడేపల్లి, ఆగస్టు 18: మండల కేంద్రంలో ఎంతోకాలంగా నిరీక్షించిన ఆర్టీసీ బస్టాండ్ ఎట్టకేలకు పునఃప్రారంభం అయినప్పటికీ ప్రయాణికులకు కష్టాలు మాత్రం తీరలేదు. విద్యుత్ దీపాలు, తాగునీరు, కనీసం కూర్చోవడానికి సరైన సీట్లు కూడా లేకుండానే బస్టాండ్ను ఎలా అందుబాటులోకి తెచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు బస్టాండ్ ఆవరణం అంధకారంలో మునిగిపోతోంది. కనీసం మరుగుదొడ్లకు డోర్లు కూడా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి వేళల్లో బస్సుల కోసం వేచి చూడాలంటేనే భయాందోళనకు గురికావాల్సి వస్తోంది.
అడ్డంకిగా మారిన డివైడర్:
ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నాలుగు లైన్ల రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్ పెద్ద శాపంగా మారింది. కోదాడ వైపు నుంచి మిర్యాలగూడ వెళ్లే బస్సులు బస్టాండ్లోకి రావడానికి వీలు లేకుండా పోయింది. అధికారులు తగిన రీతిలో యూ-టర్న్ సౌకర్యం కల్పించకపోవడంతో కొన్ని బస్సులు బయటి నుంచే వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు నిరీక్షించలేక నానా అవస్థలు పడుతున్నారు. బస్టాండ్లోకి అన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, రాకపోకలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోలర్తో పాటు పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వర్షం పడితే బురద మయం:
బస్టాండ్ ఆవరణలో బస్సులు నిలిచే ప్రాంతాన్ని సీసీ రోడ్డుగా మార్చకుండా కేవలం మట్టి, కంకరతో వదిలేశారని, చిన్న వర్షం పడినా బురదమయంగా మారి గుంతలు ఏర్పడే ప్రమాదం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. గోడలకు రంగులు వేయడం, బస్సుల వేళల పట్టిక (టైమ్టేబుల్), తాగునీరు, ఫ్యాన్లు, ఫినాయిల్తో పరిశుభ్రత వంటి కనీస సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మౌలిక వసతులు కల్పించాలి:
గతంలో పోలీస్స్టేషన్ వద్ద బస్సులు నిలిపివేయడంతో ఎండకు ఎండి, వర్షానికి తడిసి ప్రయాణికులు నరకం చూశా రు. ఇప్పుడు బస్టాండ్ తెరిచినా కనీస వ సతులు లేకపోవడం బాధాకరం. వెంట నే మరుగుదొడ్లు, తాగునీరు, వెలుతురు సౌకర్యం కల్పించాలి.‘
పోకల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు






