ద్రవ్యోల్బణం ముంగిట భారత్!
డీ జైరామ్ :
ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరం లో భారత ఆర్థిక వ్యవస్థ ఒక కీలకమైన మలుపులో ఉంది. ఒకవైపు తయారీ, సేవల రంగాల్లో బలమైన వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరల పెరుగుదల తయారీదారులు, వినియోగదారులపై తీవ్ర ప్రభా వాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక, తయారీరంగాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగించే అత్యంత ప్రామాణికమైన ఆర్థిక సూచిక అయిన కొనుగోలు నిర్వాహకుల సూచిక (పీఎంఐ) గురించిన సమగ్ర విశ్లేషణను పరిశీలిద్దాం.
ఈ సూచిక ఆర్థిక వ్యవస్థలోని తయారీ, సేవారంగాల ఆరోగ్యాన్ని, ఉత్పత్తి కార్యకలాపాలను స్పష్టం గా ప్రతిబింబిస్తుంది. దేశ తయారీరంగంలో వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయో ముం దుగానే తెలియజేయడమే కాకుండా, భవిష్యత్తులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఎలా ఉండబోతుందో అంచనా వేయడానికి సహాయపడుతుంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపా ర సంస్థలు ముడిసరుకు కొనుగోళ్లు, నిల్వ లు, ఉపాధి అవకాశాల గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మార్గదర్శకం గా ఉంటుంది.
తయారీదారులు ముడిసరుకుల కోసం చెల్లిస్తున్న ధరలను బట్టి, భవిష్య త్తులో వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందో, లేదో ముందుగానే పసిగట్టవచ్చు. దీనివల్ల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సరైన ద్రవ్య విధానాలను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే, పీఎంఐ పెరిగితే ఆయా సంస్థలు కొత్త ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉం టుందని, దీని ద్వారా ఉపాధి అవకాశాల వృద్ధిని అంచనా వేయవచ్చని చెప్పవచ్చు.
తయారీరంగంలో ఈ సూచీ మార్చి నెల లో కనిపించిన స్వల్ప తగ్గుదల తర్వాత, ఏప్రిల్ నాటికి 55.9 స్థాయికి చేరుకోవడం పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని సూచిస్తుంది. కొత్త ఆర్డర్లు, ఉపాధి కల్పన పెరుగుదల దేశీయంగా డిమాండ్ స్థిరంగా ఉందని తెలియజేస్తున్నాయి. అయి నా, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సం క్షోభం కారణంగా ముడిసరుకులు, ఇంధన ధరలు ఇంచుమించుగా మూడేళ్ల గరిష్టస్థాయికి చేరాయి.
తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచవలసి వస్తోంది. దీనివల్ల అంతిమంగా ధరల సూచికలపై ఒత్తిడి పెరుగుతోంది. సేవల రంగం కూడా 58.3 స్థాయి వద్ద ఉండి బలమైన విస్తరణను ప్రదర్శిస్తున్నప్పటికీ, ఇక్కడా సేవలం దించే వ్యయాలు పెరుగుతున్నాయి. రవా ణా, విద్యుత్, నిర్వహణ ఖర్చులు పెరగడం తో సేవల రంగానికి చెందిన సంస్థలు ధరలను సవరించవలసి వస్తోంది.
వినియోగదారుల ధరల సూచిక ప్రకా రం, మార్చి 2026 నాటికి దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి పెరిగింది. ఇది వరుసగా మూడవ నెల కూడా పెరుగుదలను నమోదు చేయడం ఆర్థిక విధాన రూప కర్తలకు ఒక హెచ్చరిక లాంటిది. ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ముఖ్యంగా కూరగాయలు, నూనెల ధరల అస్థిరత దీనికి ప్రధాన కారణం. దీనికితోడు ఈ ఏడాది రుతుపవనాలు, ఎల్ నినో పరిస్థితులు, వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం చూపే అవ కాశం ఉన్నందున రాబోయే నెలల్లో ధరల సూచిక ఎలా ఉంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అందువల్ల, ధరల పెరుగుదల తాత్కాలికమైనది కాకుండా, సరఫరా గొలుసుల వైఫల్యం, ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఒత్తిళ్లను అధిగమించడానికి దేశీయ ఉత్పత్తిని పెంచుకోవడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం వంటి చర్యలు అవసరమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
భారతీయ తయారీదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ముడిసరుకుల ధ రల అస్థిరత. అంతర్జాతీయ పరిణామాలు తయారీరంగంలో ఇన్‌పుట్ ఖర్చులను విపరీతంగా పెంచడానికి కారణమవుతున్నాయి. పరిశ్రమలు ఈ అదనపు భారాన్ని పూర్తిగా వినియోగదారులపైకి నెట్టలేకపోవడం వల్ల వాటి లాభదాయకత తగ్గిపోతోంది. ఇది భ విష్యత్తులో కొత్త పెట్టుబడులకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది.
ఇక ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే అది సామాన్యుల కొనుగోలు శక్తిని తగ్గించి, పరోక్షంగా తయారీరంగ ఉత్పత్తుల డిమాండ్‌నూ దెబ్బతీ స్తుంది. దేశీయంగా తయారీ, సేవల రంగా లు పటిష్ఠంగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల భారతీయ ఎగుమతులపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. అమెరికా, యూరప్ వంటి ప్రధాన మార్కెట్లలో కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల కొత్త ఎగుమతి ఆర్డర్ల వృద్ధి మందగిస్తోంది.
ఇది దేశీయ తయారీరంగ దీర్ఘకాలిక విస్తరణకు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. తయారీ, సేవల రంగాల్లో సూచీలు పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన ఉపాధి కల్పనలో ఇంకా కొన్ని అంతరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, సాంకేతికత, ఆటోమేషన్ వేగం గా మారుతున్న నేపథ్యంలో ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న శ్రామిక శక్తి కొరత వేధిస్తోంది. ఈ నైపుణ్యాల కొరత దీర్ఘకాలిక ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఉపాధి వృద్ధిని ప్రభావితం చేస్తుంది.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్బీఐ అనుసరిస్తున్న కఠినమైన ద్రవ్య విధానం పరిశ్రమలకు నిధుల లభ్యతపై ప్ర భావం చూపుతోంది. అధిక వడ్డీరేట్ల కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ లు రుణాలు పొందడం కష్టంగా మారింది. ఇది వారి విస్తరణ ప్రణాళికలు, మూలధన వ్యయాలను పరిమితం చేస్తుంది.
తయారీరంగం మొత్తం వృద్ధిని నిలబెట్టుకోవడానికి ఈ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఆర్థిక అడ్డంకులను అధిగమించడం అత్యంత కీలకం. వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు నే రుగా గ్రామీణ ఆదాయాలపై ప్రభావం చూ పుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గితే, అది తయారీరంగ ఉత్పత్తుల డిమాండ్‌ను తగ్గిస్తుంది. అందువల్ల, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్చడం చాలా అవసరం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాల కలయిక అవసరం. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, సరఫరా గొలుసులను పటిష్ఠం చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు.
అంతర్జాతీయ అనిశ్చితి వల్ల తలెత్తే ముడిసరుకుల ధరల ఒత్తిళ్లను తగ్గించడానికి దేశీ యంగా పారిశ్రామిక అనుసంధానం, ప్రత్యామ్నాయ వనరుల అన్వేషణ ముఖ్యం. దీం తోపాటు పరిశ్రమలకు ముడిసరుకులను స కాలంలో అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా నిల్వ ఖర్చులు తగ్గి, ఉత్పత్తి వ్యయం అదుపులోకి వస్తుంది.
ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యతను కాపా డటం అవసరం. ఆర్బీఐ తీసుకునే నిర్ణయా లు స్థిరంగా ఉండటమే కాకుండా, చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీకి రుణాల లభ్యతను సులభతరం చేసేలా ఉండాలి. వ్యవసాయ, ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆహార నిల్వలను పటిష్ఠం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో జరిగే నష్టాలను తగ్గించడానికి శీతల గిడ్డంగుల నెట్‌వర్క్‌ను విస్తరించడం అత్యవసరం.
శ్రామిక శక్తికి నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. అలాగే, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలను మరిం త విస్తరించడం ద్వారా తయారీరంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించవచ్చు.
భారత్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలంటే నైపుణ్యాల పెంపు, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు, సరసమైన ద్రవ్య విధానాలు ఎంతైనా ఉంది. విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు కలిసికట్టుగా ఒక స్పష్టమైన వ్యూహాన్ని అమలుపరిచినప్పుడే, ద్రవ్యోల్బణ అడ్డంకులను దాటి భారత్ సుస్థిరమైన ఆర్థిక ప్రగతిని సాధించగలదు. భవిష్యత్తులో ఈ వృద్ధిని స్థిరీకరించుకుంటూ, ప్రపంచ మార్కెట్లో మనదైన ముద్రవేయడానికి ఇదే సరైన సమయం.
వ్యాసకర్త: శ్రీజైరామ్ కాంపిటీటివ్ అకాడమీ ఫౌండర్






