ఆలోచనే విజయం సాధిస్తుంది
పాలకుర్తి రామమూర్తి :
ఏకం హన్యాన్న వా హన్యాదిషుః
క్షిప్తో ధనుష్మతా,
ప్రాజ్ఞేన తు మతిః క్షిప్తా
హన్యాద్గర్భగతానపి!
(కౌటిలీయం- 10-6)
ధానుష్కుడు (ధనస్సును ధరించినవాడు) విడిచిన బాణం ఒకనిని చంపవచ్చు, చంపకపోవచ్చును కానీ బుద్ధిమంతుడు విసిరిన ఆలోచన (మతిః) మాత్రం తరతరాలు గా ప్రభావాన్ని చూపుతుంది లేదా భవిష్యత్తు సామర్థ్యాన్ని కూడా దెబ్బతీయగలదు, అంటాడు ఆచార్య చాణక్య. సమస్య పరిష్కారంలో తత్ క్షణ చర్య బాణం అనుకుంటే.. సమస్య శాశ్వత సమూల పరిష్కారానికి మతియే కావాలి.
వ్యూహం వ్యవస్థను, భవిష్యత్తును మారుస్తుంది. అర్థశాస్త్రం పదవ అధికరణం ఆరవ ఆధ్యాయంలో, యుద్ధ సమయంలో వివిధ వ్యూహాలను పన్నడం, చతురంగ బలాలనా వ్యూహంలో నడపడం, వివిధ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నడం ఎలాగో స్పష్టమైన అవగాహనను కల్పిస్తున్నాడు చాణక్య. అలాగే ఒక్కొక్కమారు ఏ వ్యూహాన్ని పన్నకుండా శత్రువును అయోమయానికి గురిచేయడం కూడా వ్యూహంగానే చెపుతారాయన. నిజానికి ఒక ఆయుధం పరిమిత సంఖ్యలో వ్యక్తులకు పరిమితమైన హాని చేయవ చ్చు.
కానీ, ఒక తెలివైన వ్యక్తి పన్నిన వ్యూహ ప్రభావం మంచైనా, చెడైనా తరతరాలుగా ప్రభావాన్ని చూపుతుంది. యుద్ధంలో శక్తి మాత్రమే కాదు, మేధాగతమైన ఆలోచనయే విజయాన్ని ఇస్తుంది. సరై న ఆలోచ నతో, వ్యూహంతో ముందుకుసాగితే శత్రువు వర్తమాన బలాన్నే కాదు, భవి ష్యత్తు బలాన్ని కూడా దెబ్బతీయవచ్చు. వా రి వంశాన్ని అంటే బంధుమిత్రవర్గాన్ని, ఆర్థిక శక్తిని, మానసిక స్థితిని దెబ్బతీయవ చ్చు. దీనిని దీర్ఘకాలిక వ్యూహంగా భావించవచ్చు.
బాణం తక్షణ ప్రభావాన్ని చూపగా, ఆలోచనాపరమైన సరైన వ్యూహం దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. మరొక కోణం లో.. బాణమనేది ఒక యుద్ధంలో సైన్యాన్ని ఓడించడం అనుకుంటే.. శత్రువు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, మిత్రబలాల ను విడదీయడం, దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడం ‘మతి’గా చూడవచ్చు. శత్రువుకు బాణం పరిమిత నష్టాన్ని కలిగిస్తే ఆలోచన అపరిమిత నష్టాన్ని కలిగిస్తుంది.
వ్యూహాన్ని పన్నకుండా ఉండడమూ అంటే ఏమీ చేయకపోవడంగా భావించడం తప్పవుతుంది. నిజానికది, స్పష్టంగా కనిపించే విధంగా వ్యూహాన్ని చూపకపోవడం లేదా సమయం కోసం వేచి ఉండడం మాత్రమే. మౌనంగా ఉండే వ్యక్తి వెనుక అనేక లెక్కలుంటాయి. ఎదుటివారి రాజకీయ అనిశ్చితిని ఉ పయోగించుకోవడమూ అందులో భాగ మే. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే దివంగత మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు.
మహాభారతంలో శకుని మాయాజూదంలో పాండవుల సర్వస్వాన్నీ గెలుచుకొని దుర్యోధనునికి ఇచ్చాడు. ఇది ప్రతికూల మేధకు లేదా మతికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదే సమయంలో ద్రౌపదిని దుర్యోధ నుడు అవమానించి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాల కారణంగా అనాయాసంగా సాధించిన సంపదను పోగొట్టుకున్నాడు. ద్రౌపదిని అవమానించడం అనేది తాత్కాలిక ప్రయోజనం. దీనిని బాణానికి ప్రతీకగా చెప్పుకోవాలి.
కృష్ణుడు భగవద్గీత ద్వారా యుద్ధ దిశనే మార్చాడు. మోహ వివశుడై, యుద్ధ విముఖుడైన అర్జునుడిని సానుకూలమతితో కర్తవ్య పరాయణునిగా నిలిపాడు. ఆ యుధాన్ని పట్టకుండా మొత్తం యుద్ధాన్ని నడిపించాడు. పాండవులకు విజయాన్ని సాధించడం ద్వారా ధర్మాన్ని స్థాపించాడు. నిజానికి ఆయుధాలు యుద్ధాన్ని గెలవవ చ్చు లేదా ఓడవచ్చు, కానీ ఆలోచన యు ద్ధాన్ని నిర్ణయిస్తుంది.
ఇది మహాభారతం చెప్పే సత్యం.పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆర్థికరంగాన్ని చైనా ఒక్కసారిగా పెను మార్పులు చేయకుండా క్రమంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పరచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వల్ల చైనా తయారీరంగం ప్రపంచమంతటా వ్యాప్తి చేసింది. ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటున్న చైనా విధానమిది. అదే మతి. ఈ ప్రగతి బా ణంతో అంటే స్పల్పకాలిక ప్రయోజనాలతో సాధించినది కాదు.
వ్యవస్థను నెమ్మదిగా మార్చిన ఆలోచనా (మతి) విధానానికి ఉదాహరణగా చూడవచ్చు. అలాగే.. ఏ విధమైన వనరులు లేని సింగపూర్ రాష్ట్ర నిర్మాణ వ్యూహంలో భాగంగా విద్య, అవినీతి రహిత పాలన, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ప్రపం చంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచింది. ఇది కూడా బాణంతో కాదు.. దీర్ఘకాల వ్యూహాలతో సాధింపబడింది. ఏ రంగంలోనైనా పో టీదారులు సిద్ధంగా లేని సమయంలోనే ముందుగా మతి ని (ఆలోచనను) ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధించడం సులువవుతుంది.
ఇదే సూత్రం ఆధునిక భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, తత్ క్షణ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తూ దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టింది. లైసెన్స్ రాజ్‌ను తగ్గించడం, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం, ప్రైవేట్ రంగా న్ని ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు దేశ భవిష్యత్తు దిశను మార్చిన వ్యూహాత్మక నిర్ణయాలు.
దీని ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ బలపడడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానం సం పాదించింది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, మూడవ స్థానానికి చేరుతుందని అంచనా. చాణక్య సూచించినట్లుగా ఇది బాణంతో కాదు మతి ద్వారా సాధించిన మార్పు. భారతదేశం అమెరికాతో భాగ స్వామ్యం నెరపుతూనే రష్యాతో సంబంధాలు కొనసాగిస్తుంది. అదే సమయంలో చైనాతో పోటీపడుతుంది.
అవసరమైన చోట సహకారాన్ని అందిస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్ర స్థానాన్ని సాధించి వివిధ పార్శ్వాలలో ప్రయోజనాలు పొందగలిగింది. భారీగా ఖర్చులు పెట్టకుం డా వ్యూహాలకు, మేధకు పదును పెట్టి అంతరిక్షరంగంలో ప్రపంచాన్ని ఆకర్షించింది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ పే మెంట్ వ్యవస్థగా రూపుదాల్చింది. ఇవన్నీ ఆలోచన ద్వారా వ్యూహాల ద్వారా సాధించినవే.
చాణక్య చెప్పిన ‘బాణం’ తత్‌క్షణం ఒక సమస్యను పరిష్కరించవచ్చు కానీ మతి (వ్యూహం లేదా ఆలోచన) మొత్తం వ్యవస్థ లో మార్పు తెస్తుంది.. భవిష్యత్తును నిర్ణయిస్తుంది, నియంత్రిస్తుంది. చాణక్య సూ చించిన సూత్రం మూడు స్థాయుల్లో పనిచేస్తుంది. అవే సరైన సమయం కోసం వేచి ఉండడం, ప్రత్యర్థిని అయోమయంలో ఉం చడం, సరైన సమయంలో సరైన ఆలోచనతో మొత్తం వ్యవస్థను ప్రభావితం చేయ డం.
యుద్ధం చేయడం శక్తి అనుకుంటే యు ద్ధం అవసరం లేకుండా కార్యాన్ని సాధించడం మతి. విజయాన్ని నిర్ణయించేది బల మూ, వేగమూ కాదు.. సరైన వ్యూహాన్ని ఆలోచించడం, దానిని ప్రణాళిక ప్రకారం అమలుచేయడం. తత్‌క్షణ దాడి గెలుపును ఇవ్వవచ్చు కానీ దీర్ఘకాలికంగా గెలిపించేది, ఆలోచించి పన్నిన వ్యూహమే.






