16 July, 2026 | 11:13 AM

మకాం మారుస్తున్న భారత సంపన్నులు

20-06-2024 01:25 AM

చలో దుబాయ్ అంటూ పోతున్న మిలియనీర్లు

ఈ ఏడాది 4,300 మంది వలస వెళ్లే అవకాశం

హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 19: కొన్నేళ్లుగా భారత్ నుంచి సంపన్నులు వలస వెళుతున్నారు. ఈ ఏడాది కూడా దాదాపు 4,300 మిలియనీర్లు భారత్ వదిలివెళ్లనున్నట్లు అంతర్జాతీయ పెట్టుబడులు, వలస పోకడలను పరిశీలించే సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదిక వెల్లడించింది. గతేడాది కూడా 5,100 మంది సంపన్న భారతీయులు ఇతర దేశాల్లో స్థిరపడ్డారని ఈ రిపోర్టు తెలిపింది. ఇలా సంపన్నుల వలసలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా చైనా, బ్రిటన్ ముందువరుసలో ఉన్నాయి. భారతదేశం ఏటా వేలాది మంది మిలియనీర్లను కోల్పోతుండగా అందులో చాలా మంది యూఏఈని డెస్టినేషన్‌గా ఎంచుకుంటున్నారు. ఇలా వలసలు పెరుగుతున్నా దశాబ్ద కాలంగా 85 శాతం సంపద వృద్ధి కారణంగా భారత్‌లో ఆందోళనలు తగ్గాయి. వలస పోతున్నవారి కన్నా అధికంగా కొత్త సంపన్నులను భారత్ సృష్టిస్తోంది అని నివేదిక తెలిపింది. 

బ్యాంకుల సహకారం

భారత్‌కు చెందిన ప్రైవేట్ బ్యాంకులు, సంపద నిర్వహణ వేదికలు యూఏఈలో క్రియాశీలంగా విస్తరిస్తున్నాయి. వారి క్లయింట్లకు పెట్టుబడి సలహా సేవలను విస్తృత స్థాయిలో అందిస్తున్నాయి. యూఏఈలో భారత కుటుంబాలకు సహకరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్, 360 వన్ వెల్త్ అనే సంస్థలు చేతులు కలిపాయి. 

కారణాలేంటి?

ఆర్థిక, పన్ను ప్రయోజనాలు, వ్యాపార అవకాశాలు, భద్రత కోసం ఎక్కువ మంది వలసలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, పదవీ విరమణ అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, జీవన ప్రమాణాలు సహా వివిధ కారణాల వల్ల మిలియనీర్ల కుటుంబాలు మకాం మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది. వీటితో పాటు భారత్‌లో పన్ను చట్లాలు క్లిష్టంగా ఉండటం, కఠిన నిబంధనల వలపెట్టుబడి వలసలు పెరిగేందుకు కారణమవుతున్నాయి.