భారత్-సౌత్- కొరియా బంధం బలోపేతం
- చిప్స్ నుంచి షిప్స్ వరకు.. అనేక తయారీ రంగాల్లో భాగస్వామ్యం
- సెమీ కండక్టర్లు, ఏఐ రంగాల్లో సరికొత్త ప్రణాళికలు
- 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం: ప్రధాని మోదీ
- ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౦: భారత్- సౌత్- కొరియా మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయని, తద్వారా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు నాలుగు కీలక ఒప్పందాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ.. తాజా ఒప్పందాలు ఇండో- -పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు బాటలు వేస్తాయని ఆకాంక్షించారు. నౌకల నిర్మాణం, ఉక్కు, ఓడరేవుల అభివద్ధి వంటి పారిశ్రామిక రంగాల్లో కుదిరిన ఒప్పందాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్ రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు.
రెండు దేశాల మధ్య ప్రస్తుతం 27 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని, 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ‘ఇండియా -కొరియా డిజిటల్ బ్రిడ్జ్’ మైలురాయిగా నిలుస్తుందని వివరించారు.
సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సమాచార సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే డిజిటల్ బ్రిడ్జ్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు, ప్రతిభ నుంచి సాంకేతికత వరకు అన్ని రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామని చెప్పారు. భారత్ తన సొంత చిప్ వ్యవస్థను నిర్మించుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని వివరించారు.
పరస్పరం ఒప్పంద పత్రాల మార్పిడి
ఆర్థిక ఒప్పంద పత్రాలను భారత్ తరపున కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి అన్ డక్-జియున్ పనక మార్చుకున్నారు. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో కుదిరిన డిజిటల్ బ్రిడ్జ్ ఒప్పందాలను భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో తే-యుల్ మార్చుకున్నారు. డిజిటల్ చెల్లింపుల అనుసంధానం ఒప్పందాన్ని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సీఈవో రితీష్ శుక్లా, దక్షిణా కొరియా ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్, క్లియరింగ్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు పార్క్ జోంగ్-సియోక్ మార్చుకున్నారు.
ఒప్పందాలివే
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు డిజిటల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించాయి. చిప్స్ నుంచి షిప్స్ వరకు, టాలెంట్ నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సౌత్ కొరియా సెమీకండక్టర్ నైపుణ్యం భారత్ నిర్మిస్తున్న చిప్ ఎకో సిస్టమ్‌కు ఎంతో తోడ్పడుతుందని అంచనా వస్తునాయి.
* ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. దీనిపై రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ద్వారా వాణిజ్య లోటు తగ్గించి, సమతుల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే టార్గెట్.
* భారత్‌కు చెందిన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్, సౌత్ కొరియా ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్, క్లియరింగ్స్ ఇన్‌స్టిట్యూట్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు అనుసంధానం కానున్నాయి.
* షిప్ బిల్డింగ్ (నౌకల నిర్మాణం), స్టీల్, పోర్టుల అభివద్ధి వంటి రంగాల్లో ఒప్పందాలు జరిగాయి.






