29 July, 2026 | 1:49 AM

భారత్ పతకాల జోరు

29-07-2026 01:05 AM

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. అంచనాలు పెట్టుకున్న కీలక క్రీడాంశాల్లో పతకాలు సాధిస్తున్నారు. పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్ రెండు పతకాలు రాగా, హైజంప్‌లో సర్వేష్ కుశారే రజతం సాధించాడు. కామన్‌వెల్త్ గేమ్స్ హైజంప్ చరిత్రలో సిల్వర్ మెడల్ రావడం ఇదే తొలిసారి. ఏపీ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజతం గెలవగా, బాక్సింగ్‌లో పలు పతకాలు ఖాయమయ్యాయి.

  1. షాట్‌పుట్‌లో షర్మిలకు స్వర్ణం,శిల్పకు కాంస్యం హై జంప్‌లో సర్వేష్‌కు రజతం
  2. తెలుగుతేజం అజయ్‌బాబుకు రజతం nబాక్సింగ్‌లో ఖాయమైన 2 మెడల్స్

ఈ స్వర్ణం వెనుక ఎన్నో కష్టాలు

అడ్డు రాని పోలియో, వయసు

గ్లాస్గో, జూలై 28 : అంతర్జాతీయ క్రీడా వేదికల్లో ఎక్కువగా యువ క్రీడాకారులే విజయాలు సాధిస్తారన్న అభిప్రాయం వినిపించేది. కానీ ఇది తప్పని నిరూపిస్తూ కామన్‌వెల్త్ గేమ్స్‌లో పలువురు సీనియర్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాలు గెలుస్తున్నారు. పారాఅథ్లెటిక్స్‌లో షర్మిలా ధన్‌ఖర్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పోలియో అడ్డుపడినా, వయసు మీద పడినా ఏమాత్రం వెనకడుగు వేయని ఆమె షాట్‌పుట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు.

గ్లాస్గో గేమ్స్ మహిళల షాట్‌పుట్‌లో 9.81 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఆమె గెలుపు ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. చిన్నతనంలోనే పోలియో బారిన పడినా, తీవ్రమైన ఆర్థిక కష్టాలు వెంటాడినా పెళ్లి తర్వాత షర్మిల అంతర్జాతీయ వేదికపై గొప్ప విజయాన్ని అందుకున్నారు.హర్యానాలోని మహేంద్రగడ్ జిల్లా చిత్రౌలీ గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయకుటుంబంలో జన్మించారు. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడడంతో ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది.

19 ఏళ్ల వయసులో పెళ్లయి, భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురయ్యారు. అనంతరం తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ కూలి పనులు చేసుకున్నారు. అయితే రెండో వివాహం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. రెండో భర్త అజిత్‌సింగ్ ఇచ్చిన ప్రోత్సాహంతో 34 ఏళ్ల వయసులో పారాస్పోర్ట్‌లోకి అడుగుపెట్టారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో సత్తా చాటారు. ఇప్పుడు కామన్‌వెల్త్‌గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన షర్మిలా ధన్‌ఖర్‌పై రాష్ట్రపతి, ప్రధాని నుంచి పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయంతో కామన్‌వెల్త్ గేమ్స్ పారాఅథ్లెటిక్స్‌లో రెండు దశాబ్దాల పతక నిరీక్షణకు తెరపడింది. 

రజతం గెలిచిన రైతు బిడ్డ

మొక్కజొన్న పొట్టుపై శిక్షణ 

అథ్లెటిక్స్ పురుషుల హై జంప్‌లో సర్వేష్ కుషారే అదరగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో రజతం గెలుచుకున్నాడు. 2.25 మీటర్ల ఎత్తును అధిగమించి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలోనే పురుషుల హైజంప్ విభాగంలో భారత్‌కు రజతం రావడం ఇదే తొలిసారి. ఈ చరిత్రాత్మక విజయంతో సర్వేష్ భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ రికార్డును తిరగరాశారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించడమే ఇప్పటివరకు హైజంప్‌లో భారత్‌కు వచ్చిన ఏకైక మెడల్.

ఇప్పుడు సర్వేష్ రజతం గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా సర్వేష్ కుషారే ఎవరా అంటూ అభిమానులు ఇంటర్‌నెట్‌లో వెతుకున్నారు. అతని ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మహారాష్ట్ర నాసిక్ జిల్లా దేవర్గావ్ అనే గ్రామానికి చెందిన ఉల్లిపాయల రైతు కుటుంబంలో జన్మించాడు. సరైన సదుపాయాలు లేకపోవడంతో, ఆయన తండ్రి స్వయంగా అమర్చిన తాత్కాలిక ల్యాండింగ్ పిట్స్‌పైనే శిక్షణ తీసుకునేవాడు. మొక్కజొన్న పొట్టు, దూది, వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన పిట్స్‌పై దూకుతూ సర్వేష్ ప్రాక్టీస్ చేసేవాడు.

దాదాపు 20 ఏళ్ల వయస్సులో 2014 జూనియర్ ఛాంపియన్‌షిప్‌తో జాతీయ స్థాయిలోకి అడుగుపెట్టాడు. 2018 ఇండియన్ ఓపెన్‌లో తొలి జాతీయ స్వర్ణం సాధించాడు. 2019లో 2.26 మీటర్లు, 2022 గుజరాత్ నేషనల్ గేమ్స్‌లో 2.27 మీటర్ల రికార్డు నెలకొల్పాడు. 2025 టోక్యో వరల్ ఛాంపియన్‌షిప్‌లో 2.18 మీటర్లతో 6వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.నిలిఅంతర్జాతీయ స్థాయిలోనూ అద్భుతంగా రాణిస్తున్న సర్వేష్ డైమండ్ లీగ్ పోడియంపై నిలిచిన తొలి భారత హై జంపర్‌గా రికార్డులకెక్కాడు. నీరజ్ చోప్రా, మురళీ శ్రీ శంకర్, వికాస్ గౌడ తర్వాత డైమండ్ లీగ్ టాప్ 3లో నిలిచిన నాలుగో భారత అథ్లెట్‌గా ఘనత సాధించాడు.