06-12-2025 12:56:51 PM
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు(IndiGo flight cancellations) సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది.దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమానాలు రద్దుతో ప్రయాణికుల అసౌకర్యంపై సుప్రీంకోర్టులో(Supreme Court) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకొచ్చిన కొత్త నిబంధనలను ఇండిగో పాటించకపోవడం వల్లే ఇబ్బందులంటూ బాధితులు సుప్రీంను ఆశ్రయించారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన జరిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇండిగో వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని,స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.
దేశవ్యాప్తంగా ఐదోరోజూ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవలకు అంతరాయం(IndiGo services disrupted) కలిగింది. శనివారం నాడు 400కు పైగా ఇండిగో విమానాలు రద్దుయినట్లు సంస్థ వెల్లడించింది. వీటిలో బెంగళూరు విమానాశ్రయంలో 124 విమానాలు (63 నిష్క్రమణలు, 61 రాకపోకలు) రద్దు చేయబడ్డాయి. ముంబై విమానాశ్రయంలో 109 విమానాలు - 51 నిష్క్రమణలు, 58 రాకపోకలు రద్దు చేయబడ్డాయని అధికారులు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో రద్దు చేసిన విమానాల సంఖ్య 106 కాగా, వీటిలో 54 బయలుదేరే విమానాలు, 52 రాకపోకలు ఉన్నాయని, హైదరాబాద్ విమానాశ్రయంలో ఇండిగో 66 విమానాలను రద్దు చేసిందని అధికారులు పేర్కొన్నారు.
ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. ఎప్పుడో బుక్ చేసుకున్నా ఈ దుస్థితి ఏంటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే విమానాల్లో వెళ్దామంటే కొనలేని ధరలో టికెట్లు ఉన్నాయని చెబుతున్నారు. విమానాల రద్దుతో పలువురు ప్రయాణికులు కన్నీటి పర్యంతమైయ్యారు. విదేశాలకు వెళ్లే విమాన టికెట్ల కంటే డొమెస్టిస్ ధరలే అధికంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది.