ఇందిరమ్మ బీమా వారికి మాత్రమే

28-09-2026 | 11:24am

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. ‘ఇందిరమ్మ బీమా’ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజ్ అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.తెలంగాణలో ‘ఇందిరమ్మ బీమా పథకం’ నవంబర్ 19న ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఆదివారం అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన.. చింతకాని మండలం నాగులవంచలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఇందిరమ్మ బీమా పథకం కింద అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న వ్యక్తి లేదా సంపాదించే సభ్యుడు మరణించిన సందర్భంలో బీమా మొత్తం అందేలా పథకాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పథకంలో ముఖ్యంగా లబ్ధిదారుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు. బీమాకు సంబంధించిన మొత్తం ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.బీమా క్లెయిమ్ చేసిన తర్వాత నామినీ బ్యాంకు ఖాతాలో 10రోజుల్లోపు బీమా సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీనివల్ల కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది.

‘ఇందిరమ్మ బీమా’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉందని సమాచారం. పేద కుటుంబాల్లో ఆకస్మికంగా వచ్చే ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బూత్ లెవల్ ఏజెంట్లు కీలకంగా పనిచేయాలని భట్టి విక్రమార్క సూచించారు. గ్రామస్థాయిలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు