calender_icon.png 15 November, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

15-11-2025 12:10:13 AM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదరపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ బొబాడే లతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ పథకం ఏపిఓ లు, అటవీ రేంజ్ అధికారులతో నర్సరీలో మొక్కల పెంపకం, ఉపాధి హామీ కూలీలకు పనుల కల్పన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల వేగవంతం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026 సంవత్సరంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 52 లక్షల మొక్కలు నాకెందుకు ప్రభుత్వం లక్ష్యం విధించిందని, తగనుగుణంగా జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీలలోని నర్సరీలలో మొక్కలను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, సారవంతమైన మట్టి, అనువైన ప్రదేశాలలో నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు పని ప్రదేశాలను గుర్తించాలని, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు 307 రూపాయలను అందిస్తుందని, ఆ దిశగా కూలీలకు పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నిరుపేదల కొరకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లను మంజూరు చేసిందని, ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, లబ్ధిదారులు ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పైలెట్ గ్రామాలలో ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పి.వి.టి.జి. లా ఇండ్ల నిర్మాణంలో ఏదైనా సమస్య తలెత్తినట్లయితే అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్మాణం వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, తరతరాలుగా నివాసం ఉంటున్న వారి పాత ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అటవీ శాఖ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను సమన్వయం చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పి.వి.టి.జి. ల ఇండ్లు డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.