సామాన్య ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
– రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట,(విజయక్రాంతి): సామాన్య ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మర్తన్నపేట, మల్కాపేట గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మామిడిపల్లి గ్రామంలో చిన్నన్న–పెద్దన్న మల్లికార్జున స్వామి వారి కళ్యాణం సందర్భంగా నిర్వహించిన నల్ల పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సౌకర్యం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వంత ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, అడుగు స్థలం లేని వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయాణాల ద్వారా సుమారు రూ.9,400 కోట్ల విలువైన ప్రయాణాలు జరిగాయని, సన్న బియ్యం పంపిణీ కూడా కొనసాగుతోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. లబ్ధిదారులు కొత్త ఇళ్లలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోయిన్ దేవరాజు, పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సర్పంచులు సింగం శ్రీహరి, మాస్కురి కాశీరం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేకల ప్రభాకర్ రెడ్డి, అజిమ్ పాషా, పార్టీ నాయకులు బొర్ర రవీందర్, బండ నర్సయ్య, నందు గౌడ్, కర్రెల భాస్కర్, కార్తీక్, వినయ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




