1 July, 2026 | 1:21 AM

ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం: మంత్రి జూపల్లి

01-07-2026 12:25 AM

పారదర్శక పాలనతో ప్రజలకు సేవలు

గద్వాల, జూన్ 30: ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయంగా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారులు ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించాలని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.గద్వాల ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా సమస్యలను తెలియజేసినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని గౌరవంగా స్వీకరించి వారం రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో ప్రజలతో కమ్యూనికేషన్ పెంచేందుకు ప్రత్యేక హెల్ప్డెస్క్ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భూభారతి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని రైతులకు వ్యవసాయ శాఖ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరవేయాలని మంత్రి సూచించారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, అమృత్ పథకం తాగునీటి పనుల వేగవంతం మల్లమ్మకుంట, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ల సామర్థ్య పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత పెంపు,బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక శాఖ ద్వారా కార్యక్రమాలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజేయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.