1 July, 2026 | 12:56 AM

మూకమామిడి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టాలి

01-07-2026 12:25 AM

ములకలపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): మూకమామిడి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు నిర్వహించాలని మూకమామిడి సర్పంచి కొర్స ఆదిలక్ష్మి అధికారులను కోరారు. మూకమామిడి ప్రాజెక్టును ఆమె మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుండి నీరు వదిలే గేట్లు, లాకులను, తెగిపోయిన గండ్లను రైతులతో కలిసి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ వర్షాకాలం మొదలై రైతులు వరి నాట్లకు సిద్ధపడుతున్నారని మూకమామిడి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో పొలాలకు నీరు అందే పరిస్థితి లేదని కాలువలకు ఇరువైపుల గట్లు తెగిపోవడంతో నీరు వృథాగా పోతోందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు కాలువలు తెగిపోయి, కాలువలలో సిల్ట్ ఎక్కువై కాలువలు అన్ని పూడికలతో ఉన్నాయని ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుండి నీరు వదిలేగేట్లు లాకులకు మరమ్మతులు చేయకపోతే రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి వస్తుందని సంబంధింత నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువలకు మరమ్మతులు చేయించాలని కోరారు. రైతుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మడకం భద్రయ్య, ప్రసాద్, దివాకర్, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.