8 March, 2026 | 1:42 PM

రెండోసారి సివిల్స్‌లో సత్తా చాటిన ఇంద్రజిత

07-03-2026 12:24 AM
  1. 627వ ర్యాంకు సాధించిన  షాద్‌నగర్ వాసిని
  2. పట్టణ ప్రముఖులతో పాటు పలువురు అభినందనలు

షాద్‌నగర్,మార్చి 6 (విజయక్రాంతి): సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ జయకేతనాన్ని ఎగురవేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఇంద్రజిత యూపీఎస్సీ ఫలి తాల్లో 627వ ర్యాంకు సాధించి పట్టుదలకు నిలువుటద్దంగా నిలిచారు.పట్టణానికి చెందిన రాఘవేందర్ రావు,మమత దంపతుల కుమార్తె అయిన ఇంద్రజితకు విజయం సాధించడం ఇది కొత్తేమీ కాదు. గతం లోనే సివిల్స్ రాసి 735వ ర్యాంకు సాధించిన ఆమె, ఆ విజయంతో సంతృప్తి చెందకుండా తన లక్ష్యాన్ని మరింత ఉన్నతంగా నిర్దేశించుకున్నారు.

ఐఏఎస్ సాధించాలనే సంకల్పంతో రెండోసారి పరీక్షకు హాజరై, తాజా ఫలితాల్లో 627వ ర్యాంకుతో తన పాత రికార్డును మెరుగుపరుచుకున్నారు. 2025లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన కఠినమైన మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ చాటారు.

ఫిబ్రవరిలో జరిగిన మౌఖిక పరీక్షలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.దేశవ్యాప్తంగా ఎంపికైన 1,087 మంది అభ్యర్థుల్లో ఇంద్రజిత 627వ స్థానంలో నిలవడం విశేషం. గతంలోనే ఆమె ప్రతిభను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పలువురు ప్రముఖులు ఆమెను ఘనంగా సన్మానించారు. వరుసగా రెండుసార్లు సివిల్స్ ర్యాంకు సాధించి షాద్‌నగర్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిన ఇంద్రజితపై పట్టణ ప్రజలు, మేధావులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.