సురక్షిత వైద్య సేవలకు కేర్ హాస్పిటల్స్ ‘ప్రవరా 2026’
ఆసుపత్రుల పరిపాలన, చట్టాల అమలుపై నిపుణుల చర్చ
హైదరాబాద్, మార్చి 6(విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవరా2026’ గవర్నెన్స్ అండ్ కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో జరిగిన ఈ సదస్సులో ఆసుపత్రుల పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై ఆసుపత్రి నిర్వాహకులు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు, క్వాలిటీ, కంప్లయెన్స్ విభాగాల ప్రతినిధులు చర్చించారు.
సదస్సు రెండో రోజు కార్పొరేట్ కంప్లయెన్స్, మెడికోలీగల్ కేసులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఆసుపత్రి భద్రత ప్రమాణాలు వంటి అంశాలపై నిపుణులు ప్రసంగించారు. ఆసుపత్రుల్లో సమగ్ర పరిపాలన వ్యవస్థలు ఉండటం రోగుల భద్రతకు, వైద్య సేవల నాణ్యతకు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
కేర్ హాస్పిటల్స్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ రోగుల చికిత్సలో ఇమిగ్రేషన్ నివేదికలు, ఎఫ్‌ఆర్‌ఆర్వో నిబంధనలు పాటించడం ఎంతో కీలకమన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు దేశాల సరిహద్దులను దాటి అందుతున్నాయి. దీంతో అంతర్జాతీయ రోగులకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు పాటించే బాధ్యత ఆసుపత్రులపై మరింత పెరిగింది.ఇమిగ్రేషన్ రిపోర్టింగ్ నిబంధనలు, ఎఫ్‌ఆర్‌ఆర్వో అవసరాలను సమర్థంగా అమలు చేయడం వల్ల అధికారులతో సమన్వయం సులభమవుతుంది, సేవల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది.
‘ప్రవరా2026’ వంటి వేదికలు ఆరోగ్యరంగ నాయకులకు రోగి సేవలు అందించడంలో చట్టపరమైన బాధ్యతలు ఎలా అనుసంధానమై ఉంటాయో అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. దీంతో ఆసుపత్రులు ఒకేసారి సమర్థవంతమైన సేవలు అందిస్తూ, చట్టాల అమలును కూడా పాటించగలవు అని తెలిపారు.ఈ సందర్భంగా స్టాట్యూటరీ కంప్లయెన్స్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. కేర్ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో చట్టపరమైన నిబంధనలను సమర్థంగా అమలు చేస్తున్న విభాగాలు, బృందాలను గుర్తించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ (క్వాలిటీ, ఆపరేషన్స్ అండ్ ఈఎస్జీ) రాజీవ్ చౌరే మాట్లాడుతూ, ప్రవరా2026 సదస్సు ద్వారా ఆసుపత్రుల్లో పరిపాలన, కంప్లయెన్స్ అంశాలపై అవగాహన పెరిగింది. చట్టాలను పాటించడం కేవలం విధి మాత్రమే కాదు, రోగి భద్రతకు మరియు నైతిక వైద్య సేవలకు అది ముఖ్యమైన ఆధారం అన్నారు.రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం, మానవ అవయవ మార్పిడి చట్టం, పీసీపీఎన్డీటీ చట్టం, పర్యావరణ నిబంధనలు, కార్మిక చట్టాలు, ఆసుపత్రి భద్రత ప్రమాణాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.




