09-11-2025 07:50:29 PM
మైనర్ బాలికలతో పనులు..
గుమ్మడిదల: పాఠశాలకు వెళ్లి చదవాల్సిన వయసులో పరిశ్రమకు వెళ్లి కూలి పని చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వారి స్వలాభం కోసం పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్న మైనర్ బాలికలతో పరిశ్రమలో పనిచేయిస్తున్న వైనం గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డు కెమి ప్యాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో వెలుగు చూసింది. బాలల హక్కుల చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండని వారిని ఎటువంటి పరిశ్రమలో కూలీలుగా పనిచేయించరాదనే నిబంధన ఉన్నప్పటికీ పరిశ్రమ యజమానులు, కాంట్రాక్టర్లు మైనర్లతో పని చేయిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయమై ప్రశ్నిస్తే మైనర్ బాలికలతో ఎటువంటి పనులు చేయించడం లేదని, వారి విద్యాభ్యాసం చేయక పోవడం తాము కారణమా అని పరిశ్రమ యజమానులు సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి చైల్డ్ లేబర్ అధికారులు బాల కార్మికులను గుర్తించి కంపెనీ యజమానులపై, కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.