09-11-2025 07:54:33 PM
హన్మకొండ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఈ.నరసింహా రెడ్డి అధ్యక్షతన ఎస్జీపిఏటి హన్మకొండ కార్యాలయంలో హనుమకొండ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు ఈ.నరసింహారెడ్డి మాట్లాడుతూ మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వము 20 నెలల కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనములు చెల్లించడం లేదని, తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జే.ఏ.సీ. ముఖ్యమంత్రికి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అనేక విజ్ఞాపన పత్రములు ఇచ్చినప్పటికీ రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈనెల 17న హైదరాబాదులోని ఇందిరా పార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, ఆ మహా ధర్నా కార్యక్రమంలో మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వము మేము దాచుకున్నటువంటి డబ్బులను మాకు ఇవ్వకుండా ఇతర పథకాలకు ఉపయోగించుకొని మమ్మల్ని ఈ విధంగా బాధించడం సరైన విధానం కాదని, ప్రభుత్వానికి తగనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసిన జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ,జిఐఎస్,లీవ్ ఎన్ క్యాస్మెంట్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, 2020 పిఆర్సీ ఏరియర్స్, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవులు, డి.ఏ.ఏరియర్స్ మొదలగు ప్రయోజనాలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురి అవుతున్నారని కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ, మనోవేదనతో అసువులు బాసిన వాళ్లు కూడా ఉన్నారని, ఒక ఉపాధ్యాయుడు బకాయిలు రాలేదని ఆవేదనతో ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రిటైర్మెంట్ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ. పురుషోత్తం, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్, యం. సింగారెడ్డి, కె.రమేష్, జి సత్యనారాయణ, శ్యామ్ సుందర్ రెడ్డి, హన్మకొండ ఎస్.టి.ఓ.యూనిట్ అధ్యక్షులు ఎల్. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి దేవదాసు, చింతగట్టు క్యాంపు అధ్యక్షులు వెంకటేశ్వర్లు భీమదేవరపల్లి బాధ్యులు పి.రాజిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతిరమణి, రాజకొమురమ్మ, విజయలక్ష్మి, సుబ్బారావు, సుగుణాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.