8 August, 2026 | 1:14 AM

భారీ వరద.. ప్రాజెక్టులకు జలకళ

08-08-2026 12:00 AM

కృష్ణా బేసిన్‌లకు పోటెత్తుతున్న ప్రవాహాలు

గోదావరి డెల్టాకు 3.11 లక్షల క్యూసెక్కుల వరద

జూరాల, శ్రీశైలంకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు బేసిన్లలోని ప్రధాన జలాశయాలకు జలకళ సంతరించుకుంది. అవసరానికి అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ముఖ్యంగా జూరాల, శ్రీశైలం జలాశయాలకు రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, గోదావరి డెల్టా వ్యవస్థకు 3.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో భారీగా వరద వస్తోంది. జలాశయాల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 792.74 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 435.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే మొత్తం సామర్థ్యంలో 54.9 శాతం నిల్వ నమోదైంది.

గత ఏడాది ఇదే రోజున జలాశయాల్లో 357.51 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, ఈసారి నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఈ నీటి లభ్యతతో సాగునీరు, తాగునీటి అవసరాలకు కొంత భరోసా ఏర్పడినప్పటికీ, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాల దృష్ట్యా జలాశయాల నిర్వహణపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ హెచ్చరికలు జారీచేసింది.