7 May, 2026 | 1:15 AM

అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారమివ్వాలి

07-05-2026 12:00 AM

ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు

మెదక్, మే 6 (విజయ క్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, గోల్ లోన్ సంస్థల మేనేజర్లతో కలిసి భద్రతపై బుధవారం అవగాహన సమావేశం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ అలారం సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, మెటల్ డిటెక్టర్లు అమర్చాలని పేర్కొన్నారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలను గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ బృందాలు జిల్లాలోని బ్యాంకులను తనిఖీ చేసి సీసీటీవీ వ్యవస్థలు, అలారం సిస్టమ్స్, భద్రతా సిబ్బంది పనితీరును సమీక్షించనున్నాయని,  గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని బ్యాంకు యాజమాన్యానికి సూచించారు. బ్యాంకుల వద్ద అరమ్డ్ గార్డులు, ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించుకోవాలని తెలిపారు. పని చేయని సీసీటీవీలను ఎప్పటికప్పుడు బాగు చేయించి, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు.

అలారం సిస్టంను స్థానిక పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేయాలని, మోషన్ సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. ఇటీవల జరుగుతున్న దోపిడీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని తెలిపారు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డియస్పి లు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, బ్యాంక్ మేనేజర్ల్ పాల్గొన్నారు.