మాదక ద్రవ్యాల నిర్మూలనకు శ్రీకారం
యాదాద్రి భువనగిరి, మే 31 (విజయక్రాంతి): యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, పేద కుటుంబాలను వీధిన పడేస్తున్న నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలుకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు అభ్కారీ, ఎన్‌పో ర్స్‌మెంట్ శాఖలు సంయుక్త ప్రణాళికను అమలు చేయనుంది. జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ యాదాద్రి డివిజన్ డీసీపీ రాజేష్‌చంద్ర, అభ్కారీ సూపరింటెండెంట్ సైదులు నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి సంసిద్ధమయ్యారు. జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్‌హౌజ్ ఆఫీసర్లతో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలో డీసీపీ రాజేష్ చంద్రతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాదక ద్రవ్యాల సరఫరాను పసిగట్టడానికి అవసరమైన సాంకేతిక సహాయ సహకారాలు అందించాలని ఎక్సైజ్ అధికారులు డీసీపీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లాలో ఎక్సైజ్ కేసులను సమీక్షించిన ఆయన ఎన్‌డీపీఎస్ యాక్టు ప్రకారం నిందితులు కేసులో నుంచి తప్పించుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకో వాలని సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా దారుల ఆటకట్టించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయనున్నట్టు పేర్కొన్నారు.






