1 September, 2026 | 12:53 AM

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

31-08-2026 11:37 PM

ఫిర్యాదుదారులకు సమాచారం అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశం

వనపర్తి టౌన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. ఖీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఏదైనా ఫిర్యాదు సంబంధిత శాఖ పరిధిలో లేకపోతే సంబంధిత శాఖకు పంపించాలని, పరిష్కరించలేని అంశాలపై నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారులకు స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి కార్యాలయాల నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను కూడా ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 16 దరఖాస్తులు రాగా, ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఒక దరఖాస్తు అందింది. ఈ కార్యక్రమంలో ఏఓ భాను ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.