కృష్ణానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
మేడ్చల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): అల్వాల్ మండలం కృష్ణానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మను చౌదరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు.
దీనిపై సిబ్బంది స్పందిస్తూ.. గర్భిణీలు క్రమం తప్పకుండా చెకప్ కోసం ఇక్కడికి వస్తున్నారని, అయితే ప్రసవాల కోసం వారిని అల్వాల్ పీహెచ్సీకి పంపిస్తున్నామని తెలిపారు. రక్త నమూనాల సేకరణ ఇక్కడే జరుగుతున్నప్పటికీ, పరీక్షల కోసం వాటిని అల్వాల్ పీహెచ్సీకి పంపాల్సి వస్తోందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రి కొనసాగుతున్న భవనం సరిపోవడం లేదని, కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉందని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు.
ఆసుపత్రిని విశాలమైన చోటుకి తరలించాలని వారు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ మందుల స్టోర్ రూమ్ను స్వయంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వాటి గడువు ముగిసే తేదీలను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన మందులు మాత్రమే రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి భవన సమస్యపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, తగిన స్థలాన్ని అన్వేషించాలని అల్వాల్ తహసీల్దార్ను ఆదేశించారు.
అలాగే, భవన మార్పునకు సంబంధించి అధికారికంగా ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయాలని ఆసుపత్రి అధికారులను సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆల్వాల్ తహసీల్దార్ రాములు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.






