మెట్రో స్వాధీనం
రూ.1,461 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ
- ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి..
- ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ఇప్పటివరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్--1ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది.
ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర సచివాలయం లో సమావేశమయ్యారు. సమావేశంలో లార్సె న్ అండ్ టూబ్రో లిమిటెడ్, ఎల్ అండ్ టీ మె ట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుం ది. ఒప్పందంపై హెచ్‌ఎంఆర్‌ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ తరఫున డీకేసేన్, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ హామీతో ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌పై ఉన్న రూ. 13,538. 53 కోట్ల అప్పును (2026, ఏప్రిల్ 30వ తేదీ నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనా న్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్టనర్స్ సంస్థ అందించింది.
ప్రయాణికులకు అనుకూలంగా..
హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్వర్క్తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు సుమా రు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్-1, ప్రతిపాదిత ఫేజ్-2 నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేత లో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్‌లోనూ హైదరాబాద్‌కు మరింత సమగ్రమైన, అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ అం డ్ టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిని ఎల్ అండ్ టీ చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.






