16 May, 2026 | 1:07 AM

తనిఖీలు నిల్.. అక్రమ రవాణా ఫుల్

16-05-2026 12:00 AM
  1. నాగలిగిద్ద చెక్పోస్టులో జాడలేని సిబ్బంది
  2. అక్రమార్కులకు సేఫ్ జోన్‌గా చెక్‌పోస్టు
  3. తనికీ కేంద్రాలపై ఏసీబీ నిఘా పెట్టాలి

నాగల్ గిద్ద, మే 15 : యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత కోసం, కర్ణాటక నుంచి అక్రమంగా వడ్లు తరలిరాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖలతో 24 గంటల నిఘా అంటూ ప్రకటించింది.

కానీ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నాగల్ గిద్ద ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండే ఈ వ్యూహాత్మక ప్రాంతంలో భద్రత, తనిఖీల విషయంలో కనబడుతున్న ఉదాసీనత అనేక అక్రమాలకు దారితీస్తోంది.  

నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం...

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నాలుగు శాఖల బృందాలు విధుల్లో ఉండాల్సి ఉండగా, ఇక్కడ కేవలం వ్యవసాయ శాఖ ఏఈఓ మహిపాల్, పోలీస్ శాఖ సిబ్బంది మాత్రమే విధుల్లో కనిపిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు గైర్హాజరవ్వడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల దళారులు కర్ణాటక నుంచి తక్కువ ధరకు వడ్లు తెచ్చి, తెలంగాణలో ఎంఎస్పీతో పాటు క్వింటాల్కు రూ.500 బోనస్ పొందేందుకు అవకాశం ఏర్పడుతోంది. దీంతో స్థానిక రైతులకు అన్యాయం జరగడంతో పాటు, ప్రతి గింజనూ కొంటామన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉంది. 

అక్రమార్కులకు సేఫ్ జోన్...

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల నుండి మహారాష్ట్ర, కర్ణాటక వైపు వెళ్లే గంజాయి స్మగ్లర్లు ఈ నాగల్ గిద్ద, మోర్గి రూట్ను సేఫ్ జోన్గా వాడుకుంటున్నారు. సరిహద్దు చెక్పోస్టులు/తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండకపోవడం, నిరంతర నిఘా లేకపోవడంతో కిలోల కొద్దీ గంజాయి, నిషేధిత గుట్కాలు సులభంగా సరిహద్దులు దాటుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుండి నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం, ఇసుకను రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు.

స్థానిక రవాణా, పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన కొందరు కిందిస్థాయి సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి రాత్రిపూట వాహనాల తనిఖీలను గాలికొదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సబ్సిడీ పశువులు, గొర్రెలను పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించడానికి, అలాగే ఇతర రాష్ట్రాల నుండి రోగాల బారిన పడిన పశువులను ఇక్కడికి తీసుకురావడానికి ఈ సరిహద్దు దారులను వాడుకుంటున్నారు. అధికారులు వీటిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. 

నామమాత్రపు తనిఖీలు

 పగటిపూట మాత్రమే పోలీసులు, అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ, అర్ధరాత్రి దాటిన తర్వాత తనిఖీ కేంద్రాలను ఖాళీగా వదిలేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశామని చెబుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకుండా అక్రమ రవాణా ఆగేదెలా? అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, అన్ని శాఖల సిబ్బందిని 24 గంటలు చెక్పోస్టుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.