సఖినేటిపల్లిలో ఇంటిగ్రేటెడ్ రూరల్ మెడికల్ సెంటర్
దేశంలోనే తొలి కేంద్రంగా ఏర్పాటు
వెనుకబడిన గ్రామాలకు కేంద్ర హబ్‌గా ఆర్‌ఐఎంసీ
అమరావతి ఏప్రిల్16 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విప్లవాత్మకంగా మార్చే దిశగా దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రూరల్ మెడికల్ సెంటర్ (ఆర్‌ఐఎంసీ) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని సఖినేటిపల్లిలో విజయవంతంగా ప్రారంభమైంది. డాక్టర్స్ ప్లస్ సంస్థ, అయినా ఆయుర్వేద, క్విక్ వైటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం, అధునాతన ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది.
ఈ కేంద్రాన్ని సఖినేటిపల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రముఖుల సమక్షంలో, బిసమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి బిసమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, వైద్య నిపుణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించగా, ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు.
ఈ ఇంటి గ్రేటెడ్ రూరల్ మెడికల్ సెంటర్ చుట్టుపక్కల గ్రామాలకు ఆరోగ్య సేవల కేంద్రంగా పనిచేసే విధంగా రూపొందించబడింది. ముఖ్యంగా వైద్యు లు, నిపుణుల సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు ఇది ఒక ప్రధా న ఆశ్రయంగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, బిసమ్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన క్విక్ వైటల్స్ యాప్‌ను అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా హరీష్ బిసమ్ మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న ఆరోగ్య అంతరాన్ని తగ్గించడం మా లక్ష్యం.
ఇండియా పాకిస్థాన్ సరిహద్దులోని ఖేమ్ కరణ్‌లో రెండో ఇంటిగ్రేటెడ్ రూరల్ మెడికల్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించనున్నాము. జూలై నాటికి దేశవ్యాప్తంగా 15 కేంద్రాలను ఏర్పాటు చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2028 నాటికి ఈ సంఖ్యను 150 కేంద్రాలకు విస్తరించనున్నాం, అని తెలిపారు. డైరెక్టర్ దుర్గా జయంత్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో మా కట్టుబాటు కొనసాగుతుంది, అని అన్నారు.






