28 June, 2026 | 1:08 PM

ఘనపూర్ కెనాల్‌కు తూట్లు

28-06-2026 12:30 PM

పట్టపగలే జేసీబీలతో మట్టి తవ్వకాలు

ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపు

చోద్యం చూస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

కొల్చారం: జిల్లాలోని ఏకైక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు ఘనపూర్ ప్రాజెక్టు ఎంఎన్ కెనాల్ కాలువ కట్ట మట్టి అక్రమ రవాణాదారులకు నిలయంగా మారింది. కాలువ కట్టను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నిర్లక్ష్యంతో పట్టపగలే జేసీబీల సహాయంతో కాలువ కట్ట నుంచి మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీంతో కాలువ కట్ట బలహీనపడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని ఎంఎన్ కెనాల్ కాలువ కట్ట నుంచి భారీగా మట్టిని తవ్వి ట్రాక్టర్లలో మెదక్–హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా తరలించారు. అనంతరం ఏడుపాయల టీ జంక్షన్ సమీపంలోని ప్రభుత్వ అసైన్డ్ భూమిలో డంపింగ్ చేసినట్లు స్థానికులు తెలిపారు.

కాలువ కట్ట నుంచి మట్టి తరలింపు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తిని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ తవ్వకాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.