08-11-2025 08:11:46 PM
రిపైర్ షెడ్ లోని కారు, కామారెడ్డి లోని పలు ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠా
బంగారు, వెండి నగలు, నగదు, బైకులు స్వాధీనం
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి పలు జిల్లాలు, పలు రాష్ట్రాలలో పలు చోరీలకు పాల్పడ్డారు. గత నెల 31న కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులోని పాత ఏడవ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆటో ఎలక్ట్రిక్ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తులు రేకులను తొలగించి షెడ్డు లోపల గల కారు, వెహికల్స్ స్కానర్స్, బ్యాటరీలు, ఏసీ ప్యానెల్, సీసీటీవీ హార్డ్ డిస్క్ లను చోరీ చేశారని దేవుని పల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్ జిల్లా దొంగల ముఠా వివరాలను వెల్లడించారు.
ఏ ఎస్ పి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, దేవునిపల్లి ఎస్ఐ లు రంజిత్, భువనేశ్వర్ రావు, సిసిఎస్ఐ ఉస్మానులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాల ఆధారంగా సాంకేతిక సమాచారం సేకరించి శనివారం నరసన్నపల్లి కామన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను చాకచక్యంగా పట్టుకొని విచారించారు. కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివ నగర్, భిక్కనూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ అంతర్ రాష్ట్ర దొంగలు 15 దొంగతనాల కు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, నిర్మల్ జిల్లాలోని బాసర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బాంసి గ్రామానికి చెందిన షేక్ రఫీక్, షేక్ ఖాదర్, షేక్ ఖయ్యూం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బండారి అశోక్, నిర్మల్ జిల్లా బాంసి గ్రామానికి చెందిన షేక్ అజ్జు లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.
వారి వద్ద నుంచి ఒక కారు, మూడు బైకులు, రెండు స్పానర్లు, మూడు ఇనుప రాడు లు, ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్, టైప్ వెపన్, డిజిల్ క్యాన్, వాహన డయాగ్నస్టిక్ స్కానర్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అంతర్ జిల్లా దొంగల ముఠా నిన్ను పట్టుకోవడంలో విజయవంతంగా కృషిచేసిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, సి సి ఎస్ సి ఐ శ్రీనివాస్, దేవునిపల్లి ఎస్ఐలు రంజిత్, భువనేశ్వర్, ఈ సి ఎస్ ఎస్ ఐ ఉస్మాన్, ప్రవీణ్, ఐటీ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది కిషన్, రాజవీర్, గణపతి, లక్ష్మీకాంత్, రవి, స్వామి, శ్రీనివాస్, మైసయ్య, శ్రావణ్ కుమార్, రాజేంద్ర కుమార్, దేవునిపల్లి హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రవికిరణ్, రాములు, అంతర్ జిల్లా ముఠాను పట్టుకోవడంలో సమన్వయం, చురుకుదనం, నిబద్ధతను, చూపిన అధికారులకు సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందించారు.