6 June, 2026 | 1:40 AM

వడ్డీరేట్లు యథాతథం

06-06-2026 12:00 AM
  1. రెపోరేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు
  2. వరుసగా మూడోసారి సవరించని ఆర్‌బీఐ
  3. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమే
  4. ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

ముంబై, జూన్ 5: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, సవాళ్ల నడుమ కొనసాగుతున్నా ఈసారి రెపోరేటు(వడ్డీరేట్ల)లో ఎలాంటి మా ర్పూ చేయడం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం  వెల్లడించారు. ఈసారి కూడా రెపోరేటులో ఎలాంటి మార్పులూ లేవని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కీలక వడ్డీరేట్లను వరుసగా మూడోసారి ఆర్‌బీఐ సవరించకపోవడం గమనార్హం.

ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన సమీక్షల్లోనూ ఈ వడ్డీరేట్లను ఆర్బీ యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే గతేడాది మాత్రం వీటిని అనేకసార్లు సవరించింది. ఇంధన ధరలు, ప్రపంచవాప్త సరఫరా పరిమితులు, ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతున్నా, దేశీయ డిమాండ్ పటిష్టంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. తయారీ, సేవల రంగాల కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని చెప్పారు.

సవాళ్లున్నా, అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి మానిటరింగ్ పాలసీ కమిటీ (ఎంపీసీ-ద్రవ్య విధాన కమిటీ) సమావేశం శుక్రవారం వరకు కొనసాగింది. ఈ సమావేశంలో ఆరుగురు సభ్యులు రెండు రోజుల పాటు చర్చలు జరిపిన అనంతరం ఏకగ్రీవంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈసారి రెపోరేటు 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంధన ధరలు అధికంగా ఉండటంతో వృద్ధి నెమ్మదించి ద్రవ్యోల్బణం పెరు గుతోందన్నారు. 2026-27 కాలానికి జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిస్తున్నామని, రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచుతున్నామని చెప్పా రు.

అదే సమయంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లకు నిబంధనలను మరింత సరళీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో ఎన్‌ఆర్‌ఐలు, ఓవ ర్సీస్ సిటిజన్ల పెట్టుబడుల పరిమితిని పెంచామని, ఎక్సేంజ్ రేట్‌పై ఎలాంటి మార్పు లేదని, దేశీయ కరెన్సీ రూపాయికి నిర్ధిష్టమైన ధరను నిర్ణయించాలనుకోవడం లేదన్నారు.

ప్రపంచ అనిశ్చితి, సంక్షోభం పరిస్థితుల్లో ఆర్బీఐ నిర్ణయాలను బ్యాంకర్లు స్వాగతించా రు. ఈ చర్య సమతుల్యమైన, వివేకవంతమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. గృహ రుణాల వడ్డీ రేటు స్థిరంగా ఉంటే గృహ రంగం అభివృద్ధి చెందుతుందని యల్ ఎస్టేట్ పరిశ్రమ సంస్థలైన క్రెడాయ్, నారెడ్కో, వివిధ రంగాలు తెలిపాయి. 

ఎంపీసీలో చైర్మన్, సభ్యులు

ఎంపీసీ కమిటీలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చైర్‌పర్సన్‌గా కొనసాగుతుండగా, డిప్యూటీ గవర్నర్ డాక్టర్ మైఖేల్ బేబబ్రత పాత్రా, ఆర్బీఐ కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్ రాజీవ్ రంజన్, కేంద్రం నియమించిన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రామ్ సింగ్, ఆర్థికవేత్త సౌగత భట్టాచార్య, డాక్టర్ నాగేష్ కుమార్ సభ్యులుగా కొనసాగుతున్నారు.