6 June, 2026 | 2:32 AM

బొగ్గు స్కాంపై విచారణ జరపాలి

06-06-2026 01:20 AM
  1. రూ.1,600 కోట్లు విలువచేసే బొగ్గును రేవంత్‌రెడ్డి మాయం చేశారు
  2. ‘నైని’నుంచి తాజా  స్కాం వరకు కేంద్రం నుంచి స్పందన లేదు
  3. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మిలాఖత్.. లేకుంటే వెంటనే విచారణ చేపట్టాలి
  4. రహస్య ఒప్పందాలతో సంస్థను బలిచేయొద్దు
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : సింగరేణిలో జరిగిన రూ.1,600 కోట్ల బొగ్గు కుంభకోణంపై కేంద్రం వెంటనే  విచారణ జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస స్కాం లతో వణికిపోతున్న సింగరేణిలో.. రూ.1600 కోట్లు  విలువ చేసే బొగ్గు మాయం చేసి సంస్థ గొంతు కోసే కుట్రకు తెరతీశారని ఆరోపించారు.

40 లక్షల మెట్రిక్ టన్నుల స్కామ్ జరగడం సంస్థ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారిక వెబ్‌సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ. క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడం ఈ కుంభకోణాన్ని తేటతెల్లం చేస్తోందని తెలిపారు. 40 లక్షల టన్నుల బొగ్గు మీద కోల్ సెస్‌తోపాటు, ఇన్‌కమ్ టాక్స్ కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించడమే కాకండా సాక్షాత్తూ బొగ్గు గనుల శాఖ చూస్తున్న మీ హయాంలో ఇంత దుర్మార్గమైన కుంభకోణం జరగడం సిగ్గుచేటు అని విమర్శిం చారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7,20,00 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూ ర్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం--1 లో ఆరు లక్షలు, రామగుండం- 2లో ౪ లక్షలు, భూపాలపల్లిలో 5 లక్షల 40 వేలు, ఇల్లందులో 3 లక్షల 50 వేలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు ఇతర వాటిని కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని లెక్కలు చూపించారు.

కానీ కోల్ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధా రమని వెల్లడించారు. ఏప్రిల్‌లోనే బొగ్గు గనులపై నిలువలను తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ బృందాలు రాకపోవడం.. చివరికి కాగ్ అధికారులు కూడా ఇప్పటిదాకా తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నదన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయా అనే బలమైన అనుమానం కార్మికలోకాన్ని వెంటాడుతోందన్నారు. ఈ స్కాంను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక  అఖిల పక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని డిమాండ్ చేశారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్ జంగ్ సైరన్..

గతంలో నైని స్కామ్ తోపాటు.. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల నిబంధనలకు పాతరేసి నేషనల్ ఆవరేజీని కూడా మించి అత్యధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని, ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని అర్థాంతరంగా రద్దుచేసి అందులోనూ దోపిడీకి తెర లేపారని కేటీఆర్ ఆరోపించారు.

అలాగే పేలుడు పదార్థాల కొనుగోళ్లలోనూ కోల్ ఇండియా కంటే 30 శాతం అధిక నిధులు చెల్లించి అనుయాయులకు కట్టబెట్టారని, అంతే కాకుండా చివరికి మెస్సీతో ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.110 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా వరుస కుంభకోణాలు జరుగుతున్నా అక్రమార్కుల భరతం పట్టకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం వెనక కాంగ్రెస్--బీజేపీ చీకటి ఒప్పందాలే కారణమని కార్మికులకు అర్థమైపోయిందని తెలిపారు.

సింగరేణిలో జరుగు తున్న అక్రమ దందాలను వెలుగులోకి తెచ్చేందుకు చివరికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా  వివరాలు బయటకు పొక్కకుండా దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని వెల్లడించారు. సింగరేణిసంస్థలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టి సంస్థను దెబ్బతీసే కాంగ్రెస్--బీజేపీల కుట్రలను బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ సహించదన్నారు. సీఎంతో మీకున్న రహస్య ఒప్పందాల కారణంగా సింగరేణి సంస్థను బలతీయవద్దని కోరారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ వెలుగులోకి తెచ్చిన రూ.1600 కోట్ల సింగరేణి బొగ్గు కుంభకోణంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను కోలుకోని విధంగా దెబ్బతీసే ఈ కుంభకోణంపై విచారణ జరపకపోతే కార్మికలోకంతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తుందని హెచ్చరించారు. 

కేంద్రం వేసిన కమిటీ ఎక్కడ?

ఈ కుంభకోణమే కాకుండా, ఇటీవల బీఆర్‌ఎస్ వెలుగులోకి తెచ్చిన నైని బొగ్గు గని టెండర్ల స్కాం కూడా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటి సింగరేణిని కబళించేందుకు సీఎం రేవంత్ హయాంలో సైట్ విజిట్  సర్టిఫికేట్ అనే నిబంధన పెట్టి, కోరుకున్న వారికి  టెండర్లు కట్టబెట్టే కుతంత్రాన్ని పేర్కొన్నారు. సాక్షాత్తూ సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తేలినా ఇప్పటిదాకా దీనిపై మీరు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.

నైని కోల్ స్కామ్‌ను బీఆర్‌ఎస్ బయటపెట్టగానే ఆగమేఘాల మీద టెండర్ల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు తప్ప టెండర్లలో అక్రమార్కుల భరతం పట్టే దిశగా ఒక్క అడుగు వేయలేదని విమర్శించారు. టెండర్ పోటీదారులను బెదిరించి, భయపెట్టి ప్రక్రియ నుంచి తప్పించే పన్నాగాలు సాగినా దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదని, ఈ టెండర్ల అక్రమాలను నిగ్గు తేల్చడానికి కేంద్రం వేసిన కమిటీ ఇప్పటివరకూ ఏం తేల్చిందో కూడా పత్తాలేదని మండిపడ్డారు.

నైని కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎందుకు మొద్దునిద్ర పోతోందో చెప్పాలన్నారు. అసలు బొగ్గు ఉత్పత్తి కోసం కోల్ ఇండియా పాటించే  విధానాలేంటి?, కాంగ్రెస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్‌ను ఎవరి ప్రయోజనాలు ఆశించి పెట్టారు?, చివరికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఎలా పక్కదారి పట్టించారు? అంశాలపై వాస్తవాలను బయటపెట్టకపోవడం కాంగ్రెస్ సీఎంతో మీకున్న లోపాయికారి ఒప్పందాలను బట్టబయలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.