6 June, 2026 | 1:55 AM

యూరియా కోసం రైతుల యుద్ధం!

06-06-2026 12:28 AM
  1. యాప్ బుకింగ్ పేరుతో కాలయాపన 
  2. బస్తాపై అదనపు దోపిడీతో రైతాంగం ఆవేదన

కుమ్రం భీం ఆసిఫాబాద్,జూన్ 5 (విజయక్రాంతి): వానాకాలం సీజన్ ప్రారంభమైన వేళ  జిల్లాలో రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఆన్లైన్ యాప్ బుకింగ్ గందరగోళం, మరోవైపు ఎరువుల దుకాణదారుల ఇష్టారాజ్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన యూరియా బస్తా ధర రూ.268 నుంచి రూ.270 మాత్రమే ఉండగా, జిల్లాలో కొంతమంది వ్యాపారులు రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

షాపుల వారీగా వేర్వేరు ధరలు చెప్పి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని షాపులు యజమానులు యూరియాతోపాటు ఇతర మందులను లింకు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలు చర్చించి ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

యాప్ బుకింగ్ రైతులకు శాపమా..?

కొత్తగా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం రైతులకు మరింత కష్టాలను తెచ్చిపెడుతోందని రైతులు వాపోతున్నారు. యాప్లో బుకింగ్ చేసిన 24 గంటలలోపు మాత్రమే యూరియా తీసుకోవాలనే నిబంధన ఉండగా, తీరా దుకాణాలకు వెళ్తే సర్వర్ లేదు, స్టాక్ అయిపోయింది అంటూ రోజుల తరబడి తిప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో గడువు ముగిసి మళ్లీ కొత్తగా బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేలు వదిలి షాపుల చుట్టూ ప్రదక్షిణ...

వ్యవసాయ పనులు మానేసి పొద్దున్నే వచ్చి క్యూలో రైతులు నిలబడుతున్నారు. యాప్లో బుకింగ్ చేయించుకున్నా సమయానికి యూరియా దొరకడం లేదు. ఒకరోజు సర్వర్ లేదంటారు.. ఇంకోరోజు స్టాక్ లేదంటారు.ఇలా తిప్పలు పెడుతున్నారాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..?

మండలంలో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత దుకాణాలపై పెద్దగా తనిఖీలు జరగకపోవడం రైతుల్లో అసంతృప్తిని పెంచుతోంది. రైతులకు అవగాహన కల్పించడం, వ్యాపారులతో సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు అవసరమని రైతులు కోరుతున్నారు.

తక్షణ చర్యలు తీసుకోవాలి.

జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి వెంటనే స్పందించి ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ధరకే యూరియా అందేలా చర్యలు తీసుకుని, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతాంగం పక్షాన పోరాటం చేస్తాం

రైతులను మోసగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వారి పక్షాన పోరాటం చేస్తాం. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ వారిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలి.

- దుర్గం దినకర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు