6 June, 2026 | 2:22 AM

గండిపేట్ ప్రభుత్వ భూమి కబ్జా కేసు బ్రహ్మనాయుడు అరెస్ట్

06-06-2026 12:58 AM

తమిళనాడు కాంచీపురంలో అదుపులోకి..

  1. నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టి
  2. వైసీపీ మాజీ ఎమ్యెల్యే ఖాతా నుంచి 1.25 కోట్ల బదిలీ
  3. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తింపు

శేరిలింగంపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ శివారు రంగా రెడ్డి జిల్లా గండిపేట్ మండలం సర్వే నెం.18లోని రూ.వేల కోట్ల విలువైన 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, రెగ్యులరైజ్ చేయాలని నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించిన ముఠాలో ప్రధా న నిందితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను తమిళనాడులోని కాంచీపురంలో అరెస్టు చేశారు.

గండిపేటలో 9. 28 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు బ్రహ్మనాయుడు తెర వెనుక మంత్రాంగం నడిపించినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ భూమికి సంబంధించి నకిలీ జీవోల తయారీ, ఆ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వెనుక ఈయన పాత్ర ఉన్న ట్లు నిర్ధారించారు. వీటికితోడు బ్రహ్మనాయుడి ఖాతా నుంచి రూ.1.25 కోట్ల నగదు బదిలీ అయినట్టు కూడా గుర్తించారు.

భూ కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన బ్రహ్మనాయుడు సహా మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఏపీలోని నరసరావుపేటలో ఉన్న బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ఇతర నిందితులైన బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్, మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. హైదరాబాద్, కేరళం, తమిళనాడు, కర్ణాటకలోని ప్రాంతాలకు నిందితులు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

శుక్రవారం బ్రహ్మనాయుడును తమిళనాడు కాంచీపురం ప్రాంతంలో నార్సిం గి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కాంచీపురం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అంనంతరం, తెలంగాణకు తరలించారు. కాగా ఈ భూమి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు కుమ్మక్కు నకిలీ పత్రాలు తయారు చేశారు. 

గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మే 23న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ, డ్రైవర్ ప్రభీన్‌ను అరెస్ట్‌చేశారు. బ్రహ్మ నాయుడు తెలంగాణ హైకోర్టుకు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరించడంతో పరారీలోకి వెళ్లాడు. సాంకేతిక నిఘా, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా అతన్ని శుక్రవారం అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.