6 June, 2026 | 1:54 AM

కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు కట్టలే

06-06-2026 12:51 AM
  1. అసెంబ్లీలో చర్చకు సిద్ధం 
  2. దోపిడీ చేయడంలో ఆయన దిట్ట 
  3. పంపులు, లిఫ్టుల కొనుగోళ్లతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం 
  4. పాలమూరులో ఆయనకు ఊరు లేకున్నా పార్లమెంటుకు పంపిండ్రు
  5. కాళేశ్వరం కూలేశ్వరం అయినా పంట సాగు పెరిగింది
  6. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, జూన్ 5 (విజయక్రాంతి): పాలమూరులో కేసీఆర్‌కు ఊరు లేకున్నా పార్లమెంటుకు పంపిన ఘనత ఇక్కడి ప్రజలదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదని, దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పంపులు, లిఫ్టుల కొనుగోలులో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసిందని ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం కరువేనా ప్యాకేజ్ 14, 15 రిజర్వాయర్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్..

ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారుస్తారని అందరూ భావించారని, మిగతా జిల్లాల కంటే సాగునీరుతోపాటు విద్య, వైద్యంతో పాటు అన్ని అంశాల్లోనూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారనుకుంటే ఇక్కడ కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నా వారు పట్టించుకోలేదని విమర్శించారు. అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్ష 81 వేల కోట్లు ఖర్చు చేశారని, అందులో లక్ష కోట్లు కాళేశ్వర ప్రాజెక్టుకు ఖర్చు చేశారని, మిగతా అన్ని సాగు నుంచి ప్రాజెక్టులకు రూ.81 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి 55 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారని, కానీ రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 48 శాతం నిధులు బేధం ఉన్నప్పటికీ 90 శాతం పనులు ఎలా పూర్తి అవుతాయని ప్రశ్నించారు. ప్రతి ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో చేసేందుకు పక్కా ప్రణాళికలు వేసుకొని అధికారులతో సమీక్షలు చేస్తూ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

ఒక్క పాలమూరు ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీరు ఉంటుందని, మిగతా ప్రాజెక్టులు అన్ని కట్టి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే 26 లక్షల ఆయకట్టు కు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే నేడు పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. పంపుల కొనుగోలులో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసిందని ఆరోపించారు.

మరో నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేయవలసి ఉందని, ప్రజలకు అందించాల్సిన ప్యాకేజీలను అందిస్తూ భూసేకరణ పూర్తి చేస్తేనే ప్రాజెక్టులలో పంపులు ఏర్పాటు చేసిన ఉపయోగం ఉంటుందని కేవలం కమిషన్ల కోసం మాత్రమే వారు పరితపించాలని విమర్శించారు.

మాయమాటలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని, భూసేకరణ పూర్తి చేయనప్పుడు ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నేడు ప్రాజెక్టులను పూర్తి చేసే చర్యలు చేపడితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో ఒకరు పంచె కట్టుకొని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుకుంటున్నారని పంచె కట్టినంత మాత్రనా వైఎస్ కాలేరని చెప్పారు. 

మోయలేని అప్పులు చేశారు

గత ప్రభుత్వం బ్యాంకులలో తెచ్చిన అప్పుల్లో రూ.41 వేల 118 కోట్లు అసలు కట్టారని, మిత్తి రూ.43 వేల 385 కోట్లు కట్టారని, సాగునీటి ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పు రూ.84 వేల 503 కట్టారని సీఎం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేసిన అప్పులు మోయలేని పరిస్థితి చేరుకున్నాయన్నారు. గడచిన 30 నెలల్లో రూ.33 వేల 567 కోట్ల అసలు, మిత్తి రూ.18 వేల 554 కోట్లు, రూ.52 వేల 121 కోట్లు చెల్లించామని వెల్లడించారు.

కేవలం ఇది సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అప్పేనని మిగతావి కూడా ఉన్నాయన్నారు. పనులకు తాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వీటిలో రూ.8 వేల కోట్లు పాలమూరు జిల్లాకు ఇచ్చామన్నారు. పాలమూరు జిల్లాకు ఇంత మొత్తంలో అందిస్తున్నప్పటికీ కొందరు అదేపనిగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది అడుగులు వేస్తున్నామన్నారు.

జూరాల 17.84 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఈరోజు 9 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. భవిష్యత్తులో బ్యారేజీలు కడుతూ తక్కువ నష్టంతో అత్యధికంగా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపి ఏది నిర్మించాలని వారితో కూడా కొంత ఖర్చు చేయించి సమిష్టిగా ముందుకెళ్తామన్నారు. జిల్లా బీఆర్ ఎస్ నేతలు మర్యాదగా మాట్లాడాలని, ఎన్నికలప్పుడే ఎన్నికల గురించి చూసుకుందామని జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. 

ఈ పర్యటన చిరస్మరణీయం: మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి నామమాత్ర పనులు చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏ ప్రాజెక్టు కట్టిన సాగునీరు అందివ్వలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేశామని మరో 10 శాతం పూర్తి చేస్తే 100 శాతం పూర్తవుతుందని చెప్పడం అబద్ధం అన్నారు. జూన్ 2014లో అధికారం లోకి వచ్చిన బీమా, నెట్టెం పాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయలేదని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టిన ఒక ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు.

మొత్తం రూ 1 లక్ష 81 వేల కోట్లు ఖర్చు నామమాత్రపు ఆయకట్టు వచ్చిందని, ఇప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, కొంత భాగం ఖమ్మం ప్రాంతాలలో రికార్డ్ స్థాయిలో పంటలు పండాయన్నారు. దేశంలోనే అత్యధిక దిగుబడి మన రాష్ట్రంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఈ యాసంగి పంటలో 71.5 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని చెప్పారు. దేశంలో తెలంగాణ 75 శాతం పండిస్తున్నదన్నారు.

పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని ప్రణాళికలు వేసుకుని అడుగులు వేస్తున్నామన్నారు. లక్షల ఆయకట్టు తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శంకర్, సంపత్, కాసిరెడ్డి నారాయణరెడ్డి, మేగారెడ్డి పాల్గొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ వివరాలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన ట్రంక్‌లో ఉదండపూర్ జలాశయం 5లో పనులు ప్యాకేజీ 16, ప్యాకేజీ 17లో ప్యాకేజీ 18గా చేపట్టినట్టు సీఎం చెప్పారు. రూ.7,802.91 కోట్ల పనులకు గాను సుమారు రూ.5,126.59 కోట్ల (65.70%) పనులు పూర్తయ్యాయని, ఉదండపూర్ జలాశయం పూర్తి చేయడానికి అవసరమైన మిగిలిన పనికి(భౌతిక) రూ.2,675.91 కోట్లు అవసరం అవుతాయన్నారు.

జూలై 2027 నాటికి పూర్తవు తుందన్నారు. దక్షిణ ప్రధాన కాలువతో సహా ఈ జలాశయం కింద ఆయకట్టు 9,36,685 ఎకరాలు ఉందన్నారు. ప్యాకేజీ 16లో మొత్తం ప్యాకేజీ మొత్తం రూ.4315.32 కోట్లు, చేసిన పని రూ.3,053.29 కోట్లు (70.50%), మిగిలిన పని (భౌతిక) రూ.1,262.03 కోట్లు (29.50%), అవసరమైన, సేకరించిన భూమి: 354 ఎకరాలు, -26 గిట్స్, 346 ఎకరాలు -20 గిట్స్ ఉన్నాయి.

ప్యాకేజీ 17లో ప్యాకేజీ మొత్తం రూ.736.08 కోట్లు, చేసిన పని రూ.501.74 కోట్లు (68.16%), మిగిలిన పని (భౌతిక) రూ.234.34 కోట్లు (31.84%), అవసరమైన, సేకరించిన భూమి ఎసి 1678-03 జిటిఎస్, ఎసి 1667-19 జిటిఎస్. ప్యాకేజీ 18లో ప్యాకేజీ మొత్తం రూ.2,751.51 కోట్లు, చేసిన పని రూ.1,571.96 కోట్లు (57.13%), మిగిలిన పని (భౌతిక) రూ.1,179.55 కోట్లు (42.86%), అవసరమైన, సేకరించిన భూమి 3,183 ఎకరాలు -26.5 గిగాహెర్ట్ ఉందని సీఎం వెల్లడించారు.