ఈ విద్యాసంవత్సరం ఇంటర్ అడ్మిషన్లు యథాతథమే..
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనంచేయాలనే నిర్ణయంపై రాష్ట్ర ప్రభు త్వం వెనక్కి తగ్గింది. ఈమేరకు ఆదివారం కీలక ప్రకటనను చేసింది. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియ ట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో నూతన విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు నష్టం జరగకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ ను చేపట్టాలని సీఎం సూచించారు.
ఇంటర్మీడియట్‌ను రద్దుచేసి సీబీఎస్‌ఈ తరహాలోనే 11, 12 తరగతులు నిర్వహించాలని.. ఫలితం గా డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్‌ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి.
మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదని, అక్కడితో విద్యను నిలిపివేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుం డా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొందని తెలిపారు.
అయితే ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైందని పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణాలతో చర్చించారు. విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై.. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనంచేసి తన నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.






