16 August, 2026 | 2:55 PM

మండల ప్రజా పరిషత్ లో ప్రతి సోమవారం ప్రజావాణి

16-08-2026 02:04 PM

ఎర్రుపాలెం ఆగస్టు 16( విజయ క్రాంతి):  మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో శారద తెలియజేశారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, స్పందనశీలతను పెంపొందించి, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయుటకు "ప్రజావాణి" కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జి.ఓ.యం.ఎస్ నెం. 04 ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియపరుస్తున్నట్లు ఎంపీడీవో వివరించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయము, ఎర్రుపాలెం నందు ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించబడును.

ఎర్రుపాలెం లోని అందరు మండల స్థాయి అధికారులు ఈ "ప్రజావాణి" కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వచ్చు ఆర్జీలను స్వీకరించి పరిష్కారము కొరకు తగు చర్యలు తీసుకుంటారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమానికి నోడల్ అధికారిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారినీ గ ఉంటారు. కావున ఎర్రుపాలెం మండలంలోని ప్రజలు వారి సమస్యలు ఏమైనా ఉంటే ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయమునకు వచ్చి వారి సమస్యలను తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజావాణిని ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.