ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టండి
- ఓబీసీలకు అనుకూల, వ్యతిరేక పార్టీలేవో తేలిపోతుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి వీహెచ్ లేఖ
హైదరాబాద్, మార్చి 24 (విజయ క్రాంతి) : ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెడితే.. ఎన్ని రాజకీయ పార్టీలు మద్దతి స్తాయో.. మద్దతివ్వని పార్టీల గుట్టు బయట పడుతోందన్నారు.
దేశంలోని ఓబీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో.. తెలంగాణలోని బీసీలు కాంగ్రెస్‌కు అండగా ఉండడంతో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తాను కూడా తమ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఎంతో ప్రయత్నం చేశారని, అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించారని, అక్కడ పెండింగ్‌లో ఉందని వీహెచ్ గుర్తు చేశారు.
ఓబీసీ రిజర్వేషన్ల కో సం ఢిల్లీలోనూ ధర్నా చేసినా.. బీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్రమోదీకి ఓబీసీలపై ఏమాత్రం అభిమానం లేదని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో వీహెచ్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటవద్దనే నిబంధనతో కోర్టుల్లో కొట్టుడుపోయిందని వివరించారు. ఈ విషయాలన్నింటిని ఇప్పటి కే వికారాబాద్ పర్యటనకు వచ్చిన ప్పుడు వివరించినట్లు తెలిపారు. రిజర్వేషన్ల అంశం పై చర్చించేందుకు గత కొన్ని రోజులుగా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదని, ఈ విలువైన విషయం చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో వీహెచ్ విజ్ఞప్తి చేశారు.




