మూడు గ్రామాలకు ‘క్షయ రహిత’ పురస్కారాలు
నూతనకల్ మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’టీబీ ముక్త్ భారత్ అభియాన్’ (క్షయ రహిత భారత్)లో భాగంగా మండల పరిదిలోని మూడు గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. మంగళవారం సూర్యాపేట జిల్లా వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 25 గ్రామ పంచాయతీలలో నూతనకల్ మండలం నుండి చిల్పకుంట్ల, కొత్తతండా, అలుగునూరు గ్రామాలు క్షయ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ నుండి ప్రశంసా పత్రాలు, అవార్డులను అందుకున్నారు.ఈ విజయంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి సునీత స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైద్యారోగ్య శాఖ, పంచాయతీ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయడం వల్లే ఈ గుర్తింపు లభించిందని ఆమె కొనియాడారు. భవిష్యత్తులో మండలాన్ని పూర్తిస్థాయిలో క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు.




