నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల రాజీవ్‌నగర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో శని వారం NEET (UG)-2026 పరీక్షకు సంబంధించిన ఇన్విజిలేటర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరీక్ష నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శకాలను ఇన్విజిలేటర్లకు వివరించారు. ఇన్విజిలేటర్లు ఉదయం 9 గంటలకు హాజరు కావాలనీ, విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారనీ, మధ్యాహ్నం 1.30 గంట తర్వాత ఎటువంటి విద్యార్థిని హాల్‌లోకి అనుమతించమన్నారు.
పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. PWD (దివ్యాంగ) అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కల్పించబడుతుంది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, మూడు ఫోటోలు (ఒకటి పోస్టుకార్డ్ సైజు, రెండు పాస్‌పోర్ట్ సైజు) తీసుకురావాలని, అలాగే ఈ ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకురావడం తప్పనిసరి. ఈ ఓరియెంటేషన్‌ను సెంటర్ సూపరింటెండెంట్ ముత్యం బుచన్న, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాస్, ఆబ్జర్వర్ డాక్టర్ డి. రామకృష్ణ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాములు కూడా ఈ కార్యక్రమానికి హాజరై సూచనలు అందించారు.






