14-11-2025 12:00:00 AM
ముంబై, నవంబర్ 13 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగే ఐపీఎల్ మినీవేలం తేదీపై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 16న మినీ వేలం అబుదాబీ వేదికగా జరగబోతోంది. ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించడం ఇది నాలుగోసారి. 2014లో తొలిసారి దుబాయి వేదికగా ఐపీఎల్ వేలం విదేశాల్లో జరిగింది.
అలాగే 2024లో దుబాయిలోనూ, 2025లో సౌదీ అరేబియా జెడ్డాలోనూ వేలాన్ని నిర్వహించారు. ఈ సారి స్వదేశంలో నిర్వహిస్తారని భావించినా లాజిస్టిక్ కారణాలతో అబుదాబీ వైపే బీసీసీఐ మొగ్గుచూపింది. చాలా ఫ్రాంచైజీలకు చెందిన కోచ్‌లు, ఇతర సిబ్బంది విదేశాల నుంచి రానుండడంతో వారికి సౌకర్యంగా అబుదాబీనే సరైన వేదికగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ట్రేడింగ్ విండో, రిటెన్షన్ జాబితాలను సమర్పించడానికి శనివారం వరకే సమయముంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు ట్రేడింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. అటు తమ రిటెన్షన్ జాబితాలపైనా తుది కసరత్తు చేస్తున్నాయి.