17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ముగిసిన ఐపీఎల్ వేడుక

05-06-2025 12:00 AM

ఐపీఎల్ క్రీడా వినోదం ఘనంగా ముగిసింది. దాదాపు రెండు నెలలపాటు క్రీడాభిమానులను క్రికెట్ మత్తులో తేలియాడేలా చేసిన ఐపీ ఎల్ 18వ సీజన్‌కు మంగళవారంతో శుభం కార్డు పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ తొలిసారి ఐపీఎల్ టైటి ల్‌ను ముద్దాడింది.

ఇక అంతకు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముగింపు వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. సాయం త్రం ఆరుగంటలకు మొదలైన ముగింపు వేడుకల్లో ‘ఆపరేషన్ సిందూర్’ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల జెండాలతో హెలికాప్టర్లు స్టేడియం పైనుంచి వెళ్లినప్పుడు ‘భారత్ మాతా కీ జై’ అని అభిమానుల నినాదాలతో స్టేడియం హోరెత్తింది.

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి బీసీసీఐ నివాళి అర్పించింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ బృందం దేశభక్తి గీతాలు అభిమానులను అలరించాయి. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ సహా ప్రముఖులు హాజరయ్యారు. 

మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగ్గా, 1294 సిక్సర్లు, 2245 బౌండరీల వర్షంతో స్టేడియాలు తడిసి ముద్దయ్యాయి. మధ్యలో పాకిస్థాన్‌తో కయ్యం కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు చిన్న విరామం వచ్చినా అభిమానుల్లో జోష్ తగ్గలేదు. అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే ఆఖరున జరిగిన ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తు.

‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ క్రీడాభిమానుల చెవులు తుప్పరిల్లేలా ప్రతీ సీజన్‌లో బరిలోకి దిగ డం, రిక్త హస్తాలతో వెనుదిరగడం అలవాటుగా చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 2009, 2011, 2016లో మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ గడప తొక్కిన బెంగళూరు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కానీ, ఈసారి ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు.

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సరిగ్గా ఐపీఎల్ 18వ సీజన్‌లోనే బెంగళూరు ఐపీఎల్ కప్పును అందుకోవడం అభినందనీయం. గత 18 సీజన్లుగా ఒకే జట్టుకు ఆడడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక వ్యక్తిపై ఎంత నమ్మకముంటే ఒక ఫ్రాంచైజీ అతడిని కొనసాగిస్తుందనడానికి నిదర్శనం విరాట్ కోహ్లీ.

ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లకు నెరవేరింది. 2011 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ ఇలా ఐసీసీ టోర్నీలు నెగ్గిన కోహ్లీ కెరీర్‌లో ఏదో తెలియని వెలితి. తాజాగా ఐపీఎల్ కప్పుతో ఆ ముచ్చటా తీరిం ది. యుద్ధంలో గెలిచినోడి గురించి మాట్లాడినప్పుడు ఓటమివైపు నిలిచిన వారిగురించీ మాట్లాడటం ఆనవాయితీ.

ఫైనల్లో ఓడిన పంజాబ్ కింగ్స్‌ను తక్కువ చేసి చూడలేం. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించింది. లీగ్ దశలో అప్రతిహత విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన పంజాబ్ చివరి మెట్టుపై బోల్తా పడినప్పటికీ తమ ఆటతీరుతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్‌లు, చీర్‌గర్ల్స్ చిందులు, అభిమానుల కేరింతలతో ఐపీఎల్ 18వ సీజన్ ముగిసిన వేళ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ మరింత జోష్‌తో మొదలవ్వాలని కోరుకుందాం.