12 July, 2026 | 12:35 PM

వచ్చేవారంలో మార్కెట్లోకి 9 ఐపీవోలు

05-05-2024 12:45 AM

న్యూఢిల్లీ, మే 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభనెలలో మందకొడిగా ఉన్న ప్రైమరీ మార్కెట్ ఇక జోరు చూపిస్తున్నది. మే 6తో మొదలయ్యే వారంలో పెద్ద ఎత్తున 9 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మూడు కంపెనీలు మెయిన్‌బోర్డు విభాగానికి చెందినవికాగా, మిగిలినవి ఎస్‌ఎంఈ డివిజన్‌లో వస్తున్నాయి. మే 6వ తేదీన ఇండెజీన్ రూ.1,800 కోట్ల సమీకరణకు ఆఫర్ తెస్తున్నది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, టీబీవో టెక్ ఆఫర్లు మే 8న ప్రారంభమవుతాయి. ఈ మూడు కంపెనీలు కలిసి వాటి ఇష్యూల ద్వారా రూ.6,000 కోట్లు సమీకరిస్తాయి. వచ్చే వారంలో ఎస్‌ఎంఈ ఇష్యూలను ఎనర్జీ మిషన్ మెషినరీస్, టీజీఐఎఫ్ ఆగ్రిబిజినెస్, సిల్క్‌ఫ్లెక్స్ పాలీమర్స్, ఫైన్‌లిస్టింగ్స్ టెక్నాలజీస్, విన్‌సోల్ ఇంజనీర్స్,  రిఫ్రాక్టరీ షేప్స్ జారీచేస్తున్నాయి. ఈ ఐపీవోలతో పాటు స్లోన్ ఇన్ఫోసిస్టమ్స్, స్టోరేజ్ టెక్నాలజీస్, అమ్కే ప్రొడక్ట్స్, సాయిస్వామి మెటల్స్ స్టాక్ ఎక్సేంజీల్లో వచ్చేవారం లిస్ట్ కానున్నాయి. మే నెలలో మరిన్ని కంపెనీలు ఐపీవోల జారీకి ప్రయత్నిస్తున్నాయి.

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో

యూఎస్ ఫండ్ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు చేసిన ఆధార్ హౌసింగ్ మే 8న జారీచేసే ఐపీవో ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఆఫర్ మే 10న ముగుస్తుంది. ఐపీవోలో రూ.1,000 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ఈ కంపెనీని ప్రమోట్ చేసిన బీసీపీ టోప్కో రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తుంది. తాజా ఈక్విటీ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్ని భవిష్యత్‌లో రుణ వితరణ, ఇతర మూలధన అవసరాలకు వాడుతుంది.

ఇండెజెన్ ఆఫర్

డిజిటల్ సర్వీసుల్ని అందించే ఇండెజెన్ రూ.1,842 కోట్ల సమీకరణకు జారీచేస్తున్న ఆఫర్ మే 6న ప్రారంభమై మే 8న ముగుస్తుంది. ఐపీవోకు రూ.430 ప్రైస్‌బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయించింది. ఆఫర్‌లో రూ.750 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో 2.93 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. తాజా ఈక్విటీ ఇష్యూ ద్వారా సేకరించే నిధుల్ని కంపెనీ రుణాల చెల్లింపునకు, మూలధన వ్యయాకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వాడుకుంటుంది.

టీబీవో టెక్ ఆఫర్

టెక్నాలజీ కంపెనీ టీబీవో టెక్ తొలి పబ్లిక్ ఇష్యూ మే 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. ఆఫర్‌లో రూ.400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుంది. ప్రస్తుత ఇన్వెస్టర్లు 1.25 కోట్ల షేర్లను ఓఎప్‌ఎస్ మార్గంలో విక్రయిస్తారు. ఈ ఐపీవోకు రూ.875 ప్రైస్ బ్యాండ్ టీబీవో టెక్ నిర్ణయించింది. ఐపీవోలో ఒనగూడే నిధుల్ని భవిష్యత్ వృద్ధికి, తన ప్లాట్‌ఫాంను పటిష్టపర్చడానికి ఉపయోగిస్తుంది. పై మూడు ప్రధాన కంపెనీలు కాకుండా ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీవోలకు వస్తున్న ఎనర్జీ మెషిన్ మెషినరీస్ రూ.41 కోట్ల ఆఫర్ మే 9న మొదలవుతుంది. రిఫ్రాక్టరీ షేప్స్, విన్‌సోల్ ఇంజనీర్స్ ఆఫర్లు మే 6న వస్తాయి. ఇవి రూ.18 కోట్లు, రూ.23 కోట్ల చొప్పున నిధుల్ని సమీకరిస్తాయి. సిల్క్‌ఫ్లెక్స్, టీజీఐఎఫ్ ఆగ్రిబిజినెస్ ఆఫర్లు మే 7న ప్రారంభమవుతాయి.