12 July, 2026 | 1:38 PM

అంచనాల్ని మించిన కోటక్ మహీంద్రా బ్యాంక్

05-05-2024 12:40 AM

నికరలాభం రూ.4,133 కోట్లు

నికర వడ్డీ ఆదాయం రూ.6,909 కోట్లు

న్యూఢిల్లీ, మే 4: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2024 మార్చితో ముగిసిన సంవత్సరంలో బ్యాంకు స్టాండెలోన్ లాభం 18.22 శాతం వృద్ధిచెంది రూ.4,133 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.6,909 కోట్ల వద్ద నిలిచింది. నికర వడ్డీ మార్జిన్ 5.22 శాతం నుంచి 5.28 శాతానికి పుంజుకుంది. మెజారిటీ విశ్లేషకులు బ్యాంక్ రూ.3,400 కోట్ల మేర నికరలాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. సమీక్షా త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ అడ్వాన్సులు 20 శాతం పెరిగి రూ.3,91,729 కోట్లకు చేరాయి. కరెంటు ఖాతా డిపాజిట్లు మాత్రం 3 శాతం పెరిగి రూ.60,160 కోట్లకు, సేవింగ్స్ డిపాజిట్లు 5 శాతం పెరుగుదలతో రూ.1,23,457 కోట్లకు, టెర్మ్ డిపాజిట్లు 35 శాతం వృద్ధితో రూ. 2,24,703 కోట్లకు పెరిగాయి. 

తగ్గిన ఎన్‌పీఏలు

బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు ఈ క్యూ4లో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 1.78 శాతం నుంచి 1.39 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 0.37 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయి.శనివారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.2 చొప్పున డివిడెండు ప్రకటించింది. 

ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టపరుస్తాం

షేర్‌హోల్డర్లకు బ్యాంక్ ప్రెజంటేషన్

కొత్త క్రెడిట్ కార్డులు జారీచేయరాదని, ఆన్‌లైన్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ ఇటీవల రిజర్వ్‌బ్యాంక్ విధించిన నియంత్రణలపై శనివారం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్వెస్టర్లకు ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ తమ ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకున్నామని, సమస్యలు పరిష్కరించేందుకు ఆర్బీఐతో కలసి పనిచేస్తామని తెలిపింది. ‘ఐటీ సిస్టమ్స్‌ను పటిష్టం చేసేందుకు కొత్త టెక్నాలజీలను అవలంబిస్తాం, మిగిలిన సమస్యలు త్వరితంగా పరిష్కరించుకునే రీతిలో రెగ్యులేటర్‌తో కలిసి పనిచేస్తాం’ అంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ నియంత్రణల కారణంగా ప్రస్తుత కస్టమర్లకు అందిస్తున్న సర్వీసులపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది. ‘మా ప్రస్తుత ఖాతాదారులకు క్రెడిట్ కార్డ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్‌లతో సహా నిరంతర సేవలు అందుతాయని హామీ ఇస్తున్నాం. మా శాఖలు కొత్త కస్టమర్లను ఆహ్వానిస్తాయి. వారికి బ్యాంక్ సేవలన్నింటినీ అందిస్తాయి’ అని బ్యాంక్ వివరించింది.